ప్రజాశక్తి - కురుపాం : ఈ ఏడాది సంపూర్ణంగా వర్షాలు కురవక ఖరీఫ్ సీజన్ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పది రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వర్షాలు కురుస్తాయని అనుకున్న రైతులకు అడియాశలే మిగిలాయి. చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి వాటివల్ల మండలంలో ఏ పంట పొలాలు కూడా సంపూర్ణంగా తడవలేదు. రోజూ మేఘాలు ఊరిస్తూ కనబడుతూ చిరు జల్లులు పడుతున్నాయి. పెద్ద వర్షాలు ఎప్పుడు కురుస్తాయోని ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు.
మండలంలో 23 పంచాయతీల్లో ఖరీఫ్ సీజన్‌లో 10,717 ఎకరాల్లో పంటలు సాగుకానున్నాయి. ఇప్పటివరకు అరకొర వర్షాలకు ఊటగడ్డలు దగ్గర ఉన్నటువంటి 135 ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. ఇంకా 10,582 ఎకరాల సాగు కావాల్సి ఉన్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
పనుల్లేక అల్లాడుతున్న వ్యవసాయ కూలీలు
మండలంలో మంచి వర్షాలు కురవకపోవడంతో వ్యవసాయ కూలీలు సైతం పనుల్లేక అల్లాడుతున్నారు. గతేడాది జూన్, జులై నెలలో మంచి వర్షాలు కురవడంతో వ్యవసాయ కూలీలకు మంచి డిమాండ్ ఉండేది. రూ.250 నుంచి రూ.300కు పైగా కూలి ఇచ్చేవారు. ఈ ఏడాది పనులు కల్పించి రూ.200 ఇచ్చే వారు కూడా కరువయ్యారు. ఇటీవల అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు అరకొర పని దొరికింది. కానీ సంపూర్ణంగా కూలి పనులు దొరకడం లేదని, ఉపాధి హామీ పనులకు వెళితే సకాలంలో కూలీలు అందక కష్టంగా మారిందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యాపారాలు పెద్దగా జరగడం లేదు
వర్షాలు సరిగా కురవకపోవడంతో వ్యాపారాలు ఏమీ పెద్దగా జరగడం లేదని ఎరువులు, పురుగుల మందుల షాపుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. అప్పులు చేసి ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేశామని చెబుతున్నారు. కొన్ని కంపెనీల మందులు అయితే క్రెడిట్ ఇచ్చారని, వారికి తిరిగి ఏ విధంగా పైకం చెల్లించాలో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షాపు అద్దెలు, విద్యుత్తు బిల్లు కట్టడానికి కూడా వ్యాపారాలు జరగడం లేదని వ్యాపారులు వాపోతున్నారు.










