కడప ప్రతినిధి : ఖరీఫ్ సాగుకు కత్తెర పడింది. గతేడాది సుమారు 70 శాతంతో పోలిస్తే 36 శాతం సాగుతో మందగమనం కొనసాగుతోంది. ఇదేతరహా పరిస్థితి కొనసాగితే 55 శాతం విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగయ్యే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. దశాబ్దానికిపైగా ఎన్నడూ లేని విధంగా పంటల సాగు పడిపోయింది. వర్షాభావం కారణంగానే పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండ్రోజుల కిందటి వరకు -44 శాతం లోటు వర్షపాతం కొనసాగింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా రెండ్రోజులుగా కురిసిన మోస్తరు వర్షానికి లోటు వర్షపాతం కొనసాగుతోంది. నేటికీ -13.8 శాతం లోటు వర్షపాతం కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 1,88,978 ఎకరాల విస్తీర్ణంలో పంట లను సాగు చేయాలనేది వ్యవసాయశాఖ లక్ష్యం. జూన్ నుంచి నేటి వరకు 97 రోజుల్లో 305.2 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. 261 మి.మీ మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఈ స్థాయి వర్షపాతం నమోదు కూడా రెండ్రోజుల కిందటి వర్షాలకు 191 నుంచి 70 మి.మీ నమోదు కావడం గమనార్హం. ఖరీఫ్ సాగును ప్రశ్నార్థకంగా మారింది. ఈ లెక్కన -13.8 శాతం లోటు వర్షపాతం కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని 1,88,978 ఎకరాల విస్తీర్ణంలో 76 వేల ఎకరాల్లో మాత్రమే విత్తన పడడం వర్షా భావ పరిస్థితుల తీవ్రతకు అద్ధం పడుతోంది. మిగిలిన 1.12 లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారింది. 81,376 ఎకరాల్లో వరి విస్తీర్ణంలో 24 వేల ఎకరాల్లో మాత్రమే వరి నాటు పడింది.
వదలని...వర్షాభావం
జిల్లాలో మినుము మినహా వరి సాగు దగ్గర నుంచి అన్ని పంటల సాగును పరిశీలిస్తే ఆందోళన కలిగిస్తోంది. సాగు విసీర్ణం తగ్గుదల కార ణాల్లో వర్షపాతాన్ని పరిశీలిస్తే 38.4 శాతం నుంచి -13.8 శాతం కొసా గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జూన్‌లో 69.2 మి.మీగానూ 38.7 మి.మీ శాతం, జులైలో 96.7 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 77.4 మి.మీ మాత్రమే నమోదైంది. ఆగస్టులో 118.4 మి.మీ వర్ష పాతం నమోదులో 105.9 మి.మీ, సెప్టెంబర్‌లో 120 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా సాధారణ నమోదు కింద నేటికి 12 మి.మీ నమోదు కావాల్సి ఉంది. కానీ బంగాళాఖాతంలో ఆవర్తన పరిస్థితుల నేపథ్యంలో 75.8 మి.మీ నమోదు కావడం ఉపశమనం కలిగించింది. ఖరీఫ్ సీజన్‌లో అత్యధికంగా 403.3 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. నేటికి వాస్తవ ప్రాతిపదికన 305.2 మి.మీ నమోదు కావాల్సి ఉండగా 260 మి.మీ మాత్రమే నమోదు కావడం గమనార్హం.
వేరుశనగకూ వెతలే!
జిల్లాలో ప్రధాన ఆహారపు పంట వరి. 91 వేల ఎకరాలకుగానూ 24 వేల ఎకరాలను సాగును మినహాయిస్తే ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. వేరుశనగ సాగు పరిస్థితిని గమనిస్తే ఆందోళన కలిగిస్తోంది. 10 వేల ఎకరాల్లో వేరుశనగ విత్తనం పడాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. పత్తి సాగును పరిశీలిస్తే 52,839 ఎకరాలు సాగు కావాల్సి ఉండగా 21,105 ఎకరాల్లోనే విత్తనం పడింది. గతేడాది ఇదేసమయానికి సుమారు 50 వేల ఎకరాల్లో విత్తనం పడింది. ఇదేతరహాలో మోస్తరు స్థాయిలో విత్తిన పంటల వివరాలను పరిశీలిస్తే మొక్కజొన్న 2,232 ఎకరాలు, మినుములు 3,8 95 ఎకరాలు, కంది 4,075 ఎకరాలు, 3,285 ఎకరాల్లో సోయాబీన్, ప్రొద్దుతిరుగుడు 575 ఎకరాలు, పసుపు 1,285 ఎకరాల్లో విత్తనం పడింది.
36 శాతమే సాగు!
ఖరీప్ సీజన్ ఎన్నడూ లేని విధంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులకు లోనైంది. 1,88,978 ఎకరాల సాగు లక్ష్యానికిగానూ 76 వేల ఎకరాల్లో విత్తనం పడింది. ఇటువంటి క్షామ పీడిత పరిస్థితుల నేపథ్యంలో 36 శాతమే పంటల సాగుకు పరిమితమైంది. ఈలెక్కన సెప్టెంబర్ నెలాఖరు నాటికి సాగు పురోగతిని మరో 20 శాతానికి పెంచినప్పటికీ మూడు ఇంట ఒక వంతులు సాగుకు అవతలి వైపున ఉండడం ఆందోళన కలిగి స్తోంది.
కెసిపైనే ఆశలన్నీ..
ప్రతి ఏటా ఆగస్టు 16న కెసి కెనాల్‌కు నీటిని విడుదల చేస్తారు. సెప్టెంబర్ రెండవ వారం నడుస్తున్నప్పటికీ నీటి విడుదలపై స్పష్టత కొరవడింది. ఈలెక్కన కెసి కెనాల్ ఆయకట్టు పరిధిలోని 92 వేల ఎకరాల్లో పంటలు సాగుపై అయోమయం నెలకొంది. అత్యధికంగా 60 నుంచి 80 వేల ఎకరాల వరకు వరి సాగయ్యే అవకాశాలు ఉంది. ఈలెక్కన మిగిలిన 11 నుంచి 21 వేల ఎకరాల్లో ఇతర రకాల పంటల సాగు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా 2023 -24 ఖరీఫ్ సీజన్‌పై ఆశలు గల్లంతయ్యే అవకాశాలు పుష్కలముగా ఉన్నాయనే సంకేతాలు అందుతుండడం ఆందోళన కలిగిస్తోంది.










