Jul 14,2023 22:22

రెండు జిల్లాల్లో 3 లక్షల ఎకరాలకుపైగా వరిసాగు
ఇప్పటికీ ఐదుశాతం పూర్తి కాని నాట్లు
నీటి ఎద్దడి సమస్యతో రైతుల అవస్థలు
వర్షాల రాకతో గోదావరి నుంచి నీటి విడుదల పెంపు
ఆగస్టులోనూ నాట్లు సాగే పరిస్థితి
కౌలురైతులకు రుణాల మంజూరులో నిర్లక్ష్యమే
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

ఖరీఫ్‌లో ముందస్తు సాగు ప్రణాళికలు విఫలమయ్యాయి. జులైలో సగం రోజులు గడిచినా ఇప్పటికీ ఐదు శాతం నాట్లు కూడా పూర్తికాని పరిస్థితి నెలకొంది. ఆగస్టు వరకూ నాట్లు పూర్తయ్యే పరిస్థితి లేదని అధికారులే చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 2.13 లక్షల ఎకరాలు, ఏలూరు జిల్లాలో లక్షా 15 వేల ఎకరాలు మొత్తం 3.30 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటి వరకూ కేవలం పది వేల ఎకరాల్లో అంటే ఐదు శాతం కూడా నాట్లు పూర్తికాని పరిస్థితి నెలకొంది. ఏలూరు జిల్లాలోనూ దాదాపు అదే పరిస్థితి ఉంది. దీంతో ఖరీఫ్‌ నాట్లు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. జూన్‌ ఒకటో తేదీన కాలువలకు సాగునీరు విడుదల చేసి ముందస్తు సాగుకు ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. వేసవి వేడిగాలులు తగ్గకపోవడంతో రైతులు నారుమడులు వేసేందుకు వెనుకంజ వేశారు. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో నారుమడులు మరింత ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం నారు చేతికొచ్చినా నీటిఎద్దడి సమస్యతో నాట్లు ముందుకు సాగని దుస్థితి నెలకొంది. వర్షాలు కురవకపోవడంతో సాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి రోజుకు మూడు వేల క్యూసెక్కుల నీరు సైతం వదలని పరిస్థితి ఏర్పడింది. గోదావరి జలాలు లేకపోవడంతో సీలేరు నుంచి వస్తున్న నీటినే వదిలారు. దీంతో దుక్కులకు నీరు చాలక నాట్లు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. దీంతో నాట్లు సకాలంలో పడని దుస్థితి ఏర్పడింది. గడిచిన రెండు రోజులుగా జిల్లాలో వర్షాలు కురవడం, గోదావరి నీటిప్రవాహం పెరగడంతో రైతులకు కొంత ఊరట లభించింది. ప్రస్తుతం రోజుకు ఏడు వేల క్యూసెక్కుల నీటిని గోదావరి నుంచి విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. సాగునీరు పూర్తిస్థాయిలో వస్తుండటంతో దమ్ములకు ఇబ్బంది తొలగనుంది. దీంతో నాట్లు ఊపందుకునే పరిస్థితి ఉంది. ఏదేమైనా అధికారుల లెక్కల ప్రకారం ఆగస్టు రెండోవారం వరకూ ఖరీఫ్‌ నాట్లు కొనసాగే పరిస్థితి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఖరీఫ్‌ నాట్లు ఆలస్యంతో ఈ ప్రభావం రబీ సాగుపైనా పడనుంది. నాట్లు ఆలస్యం అవుతుండటంతో ఖరీఫ్‌ మాసూళ్లు సైతం నవంబర్‌, డిసెంబర్‌ల్లో రానున్నాయి. పంట తుఫాన్ల బారిన పడే ప్రమాదం ఉందని రైతులు లోలోన ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఖరీఫ్‌ నాట్లు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు రైతులను సమాయత్తం చేయాల్సి ఉంది.
కౌెలురైతుల పట్ల కొనసాగుతున్న నిర్లక్ష్యం
రెండు జిల్లాల్లో దాదాపు మూడు లక్షల మంది వరకూ కౌలురైతులు ఉన్నారు. జిల్లా వ్యవసాయ సాగులో వీరిదే కీలకపాత్ర. ప్రభుత్వం మాత్రం కౌలురైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ప్రతియేటా మాదిరిగానే ఈ ఏడాదీ కౌలుకార్డుల జారీలోనూ, రుణాల మంజూరులోనూ నిర్లక్ష్యమే కొనసాగుతోంది. ఏలూరు జిల్లాలో 48 వేల వరకూ కౌలుకార్డులు ఇవ్వాలని టార్గెట్‌గా పెట్టుకుని ఇప్పటి వరకూ 38 వేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. కౌలురైతులకు బ్యాంకు రుణాల మంజూరు గురించి ఏఒక్క అధికారీ నోరు మెదపడం లేదు. 2022లో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో బ్యాంకుల నుంచి పంట రుణాలు అందుకున్న రైతులు అతి తక్కువ మంది ఉన్నారు. ఈ ఏడాది కూడా కౌలురైతులకు అన్యాయం చేసే పరిస్థితులు కన్పిస్తున్నాయి. త్వరితగతిన కౌలుకార్డుల జారీ ప్రక్రియ పూర్తి చేసి, కౌలురైతులకు పంట రుణాలు అందిస్తే అన్నదాతకు మేలు జరుగుతుంది. లేనిపక్షంలో ప్రయివేటు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో కౌలురైతులు చిక్కుకుపోనున్నారు.