ప్రజాశక్తి -గుంటూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో ఖరీఫ్ సాగు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. సీజన ప్రారంభం అయి 40 రోజులు దాటినా ఇంత వరకు సాగు వేగం పుంజుకోలేదు. జిల్లాలో 3.25 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలనుసాగు చేస్తారని అంచనా వేయగా ఇప్పటి వరకు కేవలం 32 వేల ఎకరాల్లోనే పంటలు వేశారు. జిల్లాలో వర్షాలు కొంత మేరకు ఆశాజనకంగా ఉన్నా సాగుకు సరిపడా కురవడం లేదు.
గుంటూరు జిల్లాలో జూన్ నెల మొత్తం 97.1 మిల్లీ మీటర్లవర్షం కురవాల్సి ఉండగా 105.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జులైలో 164.9 మిల్లీ మీటర్ల వర్షపాతం అవసరం కాగా 17వ తేదీ వరకు 141.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. జిల్లాలోని కొన్ని మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదు కాగా మరికొన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు అయినట్టు అధికార వర్గాలు తెలిపాయి. జిల్లాలో 1.65 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తారని అంచనా ఉండగా ఇప్పటి వరకు కేవలం 12500 ఎకరాల్లోనే వెదపద్ధతిలో సాగు చేశారు. డెల్టాలోఇంకా నాట్లు ప్రారంభం కాలేదు. పత్తి సాగు 77 వేల ఎకరాల్లో చేస్తారని అధికారులు అంచనా వేయగా ఇప్పటి వరకు కేవలం 16 వేల ఎకరాల్లోనే విత్తనాలు నాటారు. కూరగాయాలు దాదాపు 6 వేల ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 400 ఎకరాల్లోనే వేశారు. పసుపు 650 ఎకరాలు, చెరకు 60 ఎకరాలు, మినుము 10 ఎకరాలు, సోయాబిన్ 300 ఎకరాలు సాగు చేశారు. అయితే తొలకరి పంటలుగా గ్రీన్ మెన్యూర్ సాగు చేస్తారని అధికారులు చెబుతున్నా ఇంత వరకు ఒక్క ఎకరంలో కూడా చేయలేదు. అలాగే మిర్చిసాగు ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటివరకు ఒక్క ఎకరంలో కూడా మిర్చివేయలేదు.కంది, పెసర కూడా ఇంకా ప్రారంభించలేదు. గతఏడాది ఇదే సమయానికి జిల్లాలో 65 వేల ఎకరాల్లో వివిధరకాల పంటలను సాగు చేయగా ఈ ఏడాది 32 వేల ఎకరాల్లో సాగు చేశారని అధికారుల వారంతపు నివేదికల్లో పేర్కొన్నారు. ముందస్తు ఖరీఫ్‌లో భాగంగా తొలకరి పంటలుగా కొంత మంది రైతులు నువ్వు, పెసర, మినుము, జూట్,జనుము,గ్రీన్ మెన్యూర్ పంటలను సాగు చేస్తున్నట్టు అధికారులు ఇప్పటి వరకు చెబుతుండగా రైతులు వీటిజోలికి వెళ్లలేదు. ఎగువ ప్రాంతాల నుంచి నీటి విడుదలపై భరసా లేకపోవడం వల్ల ఈ ఏడాది సాగు ఆలస్యం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. రైతులు కూడా నీటి ఎద్దడి సమస్య పొంచి ఉండటంతో సాగుపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
శ్రీశైలంకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో రావడంలేదు. శ్రీశైలం జలాశయంలో గరిష్ట నీటి నిల్వ 215.80 టిఎంసిలు కాగా ప్రస్తుతం 33.67 టిఎంసిలు మాత్రమే నిల్వ ఉన్నాయి. సాగర్‌జలాశయంలో గరిష్ట నీటి నిల్వ 312.04 టిఎంసిలు సామర్ధ్యం ఉండగా ప్రస్తుతం 145.29 టిఎంసిలు ఉన్నాయి. పులిచింతల గరిష్ట నీటి నిల్వ సామర్ధ్యం 45.77 టిఎంసిలు కాగా ప్రస్తుతం 18.36 టిఎంసిలకు తగ్గిపోయింది. గతేడాది జులై రెండో వారం కల్లా ఆల్మట్టి, నారాయణ్‌పూర్, జూరాల జలాశయాలకు వరద ప్రారంభం అయిందని ఈ ఏడాది ప్రస్తుతం కర్నాటకలో వర్షాలు లేక ఎగువ నుంచి జలాశయాలకు నీరు రావడంలేదని అధికారులు తెలిపారు. అయితే ప్రకాశం బ్యారేజికి ఎగువన,పులిచింతల దిగువన ఖమ్మం, ఎన్‌టిఆర్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజికి గత కొద్ది రోజులుగా ఇన్‌ఫ్లో ఆశాజనకంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 7238 క్యూసెక్కుల నీరు వస్తుండగా కృష్ణా తూర్పు డెల్టా (ఉమ్మడి కృష్ణాజిల్లా, ఏలూరుజిల్లా)కు 6,016 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టా (గుంటూరు,బాపట్ల జిల్లాలు)కు 1,141క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గుంటూరు ఛానల్‌కు 81 క్యూసెక్కులు విడుదల అవుతున్నట్టు అధికారులు తెలిపారు. పశ్చిమ డెల్టాకు చాలినంతగా నీరు రాకపోవడం వల్ల రైతులు ఇంకా నారుమళ్లు పోయడం లేదని చెబుతున్నారు.










