Aug 20,2023 21:41

ఖరీఫ్ కుదేల్

పీలేరు : ఈ ఏడాదీ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు ఒడ గాల్పులు, రాత్రిళ్లు ఉక్కపోతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అప్పు డప్పుడూ చల్లగాలులు వీస్తూ, నీలి మేఘాలు ఊరిస్తున్నాయే తప్ప, సకాలంలో చినుకైనా నేల రాల్చడం లేదు. వాన జాడ కోసం ఆకాశం కేసి చేస్తున్న అన్నదాత ఆశలు ఆవిరై పోతున్నాయి. ఈ ఖరీఫ్‌లో వేరుశనగ సాగు కోసం రైతన్నలు ఓ వైపు దుక్కిదున్ని సిద్ధం చేసుకున్న పొలాలు ఒక వైపు, చెమ్మగున్న మట్టిలో విత్తనం విత్తి.. నీరందక ఎండుతున్న పొలాలు మరోవైపు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇంకోవైపు పెరుగుతున్న వేరుశనగ చెట్లకు కలుపు తీస్తూ వర్షం కోసం ఎదురు చూస్తూ... అన్నదాతలు ప్రతి సంవ త్సరంలాగే ఈ ఏడు కూడా వర్షం కోసం ఎదురు చూడక తప్పడంలేదు. గతేడాది ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలో కురిసిన వర్షాలు రైతన్నల గుండెల్లో ఆశలు రేపాయి. చివరికి వేరుశనగ అదునులో పదును వర్షమైనా కురవక విత్తనాలు విత్తుకోలేని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాదైనా సకాలంలో వర్షాలు కురుస్తాయేమో, ఖరీఫ్‌ సీజన్‌ ఆదుకుంటుందేమో, ఇన్నేళ్ళ తమ శ్రమకు తగిన ఫలితం దక్కి తాము చేసిన అప్పులు తీరుతాయని, ఆర్థిక ఇబ్బంధులు తొలగుతాయని భావించిన కర్షకులకు వర్షం కన్నీరు మిగిల్చే పరిస్థితులు పున రావృతం అవుతాయా... అన్న అనుమానాలు రైతన్నల్లో మొదలయ్యాయి. ప్రభు త్వం రైతులకు అందించే సబ్సిడీ వేరుశనగ విత్తనాలు తగినన్ని పంపిణీ చేశారు.
ఈ ఏడాది కూడా ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభ వర్షాలు ఊరిస్తూ అలక బూనాయి. కరుణిస్తాయని భావించిన నైరుతి రుతు పవనాలు కూడా అంతంత మాత్రంగానే వర్షించాయి. సహజంగా నైరుతి రుతు పవనాల ద్వారానే అధిక వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. మే నెలలో పలుకరించాల్సిన తొలకరి వానలు సైతం అలకబూని ఆలస్యంగా కురిశాయి.. అడపా దడపా కురిసిన వర్షాలతో ఖరీఫ్‌ రైతులు దుక్కులు దున్నుకున్నారు. ఈ సంవత్సరం జూన్‌15 నుంచి ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైంది. జూన్‌, జూలై రెండు మాసాల్లోనూ కొన్ని చోట్ల సాధారణ వర్ష పాతం కన్నా తక్కువే నామోదైంది. మరి కొన్ని చోట్ల సాధారణ వర్ష పాతమైనా నమోదు కాలేదు. కురిసిన అరా కొరా వర్షాలతోనే రైతులు కొందరు వేరుశనగ విత్తుకున్నారు. జూలై 15లోపే వేరు శనగను విత్తు కోవడానికి సరైన అదును సమయం. అప్పుడు విత్తనాలను విత్తుకున్న రైతులకే వర్షాలు కురిస్తే ఆశించిన మేరకు పంట దిగుబడి సాధ్యమౌతుంది.
పీలేరు వ్యవసాయ డివిజన్‌లో ఖరీఫ్‌ స్థితీ..గతీ
పీలేరు వ్యవసాయ డివిజను పరిధిలో పీలేరు నియోజకవర్గంలోని పీలేరు, కె.వి.పల్లి మండలాలు, చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టిగల్లు, యర్రావారిపాళెం మండలాలు, పుంగనూరు నియోజక వర్గం పరిధిలోని రొంపిచెర్ల, సదుం మండలాలు ఉండేవి. జిల్లా పునర్విభజనతో ప్రస్తుతం పీలేరు డివిజన్‌లో పీలేరు, కె.వి. పల్లి మండలాలు మాత్రమే మిగిలాయి. ఈ ప్రాంత రైతులు అత్యధికంగా వర్షాధారిత పంటలపైనే ఆధారపడి సాగు చేస్తారు. అందులోనూ ఈ ప్రాంత రైతులు వేరుశనగను ప్రధాన వాణిజ్య పంటగా ఎంచుకుంటారు. ఈ డివిజన్‌లో వేరుశనగ సాధారణ విస్తీర్ణం 5,729 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు కేవలం 2,037 హెక్టార్లలో మాత్రమే రైతులు విత్తనాలు విత్తుకున్నారు. అదే విధంగా వరి సాగు సాధారణ విస్తీర్ణం 632 హెక్టార్లు కాగా అన్నదాతలు బోరు బావులపై ఆధార పడి కేవలం 291 హెక్టార్లలో మాత్రమే వరి సాగు చేస్తున్నారు. చెరకు, కంది, అనుములు, రాగి పంటలపై ఎవరూ ఆసక్తి చూపలేదు. డివిజన్‌ పరిధిలో ఆహార పంటల సాగు కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ ఏడాది పశుగ్రాసం కొరత కూడా ఏర్పడే ప్రమాదం ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పీలేరు వ్యవసాయ డివిజన్‌ పరిధిలోని పీలేరు మండలంలో సాధారణ వర్షపాతం 179 మిల్లీ మీటర్లు కాగా ఇప్పటి వరకు కేవలం 94 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కె.వి. పల్లి మండలంలో సాధారణ వర్షపాతం 144 మిల్లీ మీటర్లు కాగా 117 మిల్లీ మీటర్ల వర్శపాతం నమోదైంది. ఈ సారి వర్షాలు సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా నమోదయ్యాయి. ఫలితంగా ఈ ఏడాది కూడా వేరుశనగ పంటతో తాము నష్ట పోనున్నామన్న ఆందోళనలో ఖరీఫ్‌ రైతన్నలు ఉన్నారు.
వేరుశనగలో రైతులు మెళుకువలు
పాటిస్తే మంచి దిగుబడులు సాధ్యం
వేరుశెనగలో రైతులు అధిక దిగుబడులు సాధించాలంటే అందుకు తగిన మెలకువలు అనుసరించాలని పీలేరు వ్యవసాయ డివిజన్‌ ఎడిఎ వై.వి. రమణరావు అంటున్నారు. 'ప్రజాశక్తి'తో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌ రైతులు విత్తనశుద్ధికి ఇమ్డాక్లోరోఫిడ్‌ను కిలో విత్తనానికి 2మిల్లీలు, డైతేన్‌ ఎం-45 సిలీంద్ర నాసినిని కేజీ విత్తనానికి 3 గ్రాములు వంతున కలిపి సిద్ధం చేసుకోవాలన్నారు. పొలం చుట్టూ జొన్న 4 నుంచి 6 సాళ్ళు వత్తుగా వేసుకోవడం వల్ల హానిచేసే దోమ లోనికి ప్రవేశించ కుండా అవి అడ్డు కుంటాయని తెలిపారు. పొలంలోపల ప్రతి ఏడాదీ సాళ్ళు వేరుశనగకు అంతర్‌ పంటగా కందిని ఒక సాలు సాగు చేసుకోవడం వల్ల అధిక ఆదాయం లభిస్తుందని చెప్పారు. పొలంలో రెండు నుంచి మూడు సాళ్ళు అలసందను కీటకాల నివారణకు ఎర పంటగా వేసుకోవాలని తెలిపారు. పొలంలో అక్కడక్కడ 40 నుంచి 50 ఆముదం మొక్కలు నాటడం వల్ల లద్దెపురుగును గుడ్డు దశలోనే నివారించవచ్చని అన్నారు. వేరుశనగ విత్తిన 48 గంటలలోపు కలుపు మందు పెండిమెథాలిన్‌ పిచకారీ చేసుకోవడం వల్ల 20 రోజుల వరకు కలుపు రాకుండా చూసుకోవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ విత్తే సమయంలో కలుపు మందు పిచకారీ చేసుకోన్నట్లయితే విత్తిన 20 రోజుల వయస్సులో ఇమాజీకాఫైర్‌ కలుపు మందు సమర్థవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఎకరానికి 200 కిలోల జిప్సం వేరుశనగ విత్తే సమయంలో లేదా పూత సమయంలోగానీ చల్లుకున్నట్లయితే గింజ బరువు, నాణ్యత పెరుగు తుందన్నారు. వేరుశనగను ఆశించే వాటిల్లో అతి ముఖ్యమైంది ఎర్రగొంగళి పురుగని, వర్షం కురిసిన మరుసటి రోజు రాత్రి వేళలో రైతులు తమ పొలం గట్లపై సామూహిక మంటలు వేయడంవల్ల తల్లి రెక్కల పురుగును అరికట్ట వచ్చని తెలిపారు. రైతులు ఈ సూచనలను పాటించి అధిక దిగుబడులను సాధించుకోవాలని ఆయన తెెలిపారు.