Oct 17,2023 23:02

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)
ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు రైస్‌ మిల్లర్లు చేసుకోవాలని మచిలీపట్నం శాసన సభ్యులు పేర్ని వెంకట్రామయ్య సూచించారు. 2023-24 ,ఖరీఫ్‌ ధాన్యం సేకరణపై మచిలీపట్టణం నియోజకవర్గం స్థాయిలో అవగాహనా సదస్సు మంగళవారం కలెక్టరేట్‌ స్పందన సమావేశ హాలులో కృష్ణాజిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అపరాజిత సింగ్‌ తో కలసి ,రైతు భరోసా కేంద్రాల లోని గ్రామ వ్యవసాయ సహాయకులు, ధాన్యం సేకరణ కేంద్రముల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు మరియు రైస్‌ మిల్లర్లతో ఖరీఫ్‌ 2023-24 ధాన్యం సేకరణపై అవగాహనా సదస్సు స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు పేర్ని వెంకట్రామయ్య మాట్లాడుతూ రైస్‌ మిల్లర్‌ లు ధాన్యం సేకరణకు అవసరమైన మేర గోనె సంచులను జాయింట్‌ కలెక్టర్‌ నిర్దేశించిన గోడౌన్లకు ముందుగానే సరఫరా చేయవలసిందిగా ఆదేశించారు. గ్రామ వ్యవసాయ సహాయకులు ఇ-క్రాప్‌ నమోదు చేసిన రైతు వారి వివరములను రైతులకు కనపడే విధముగా ఈ నెల 21 నాటికి రైతు భరోసా కేంద్రములో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ ప్రతి గ్రామములో గ్రామ సభలు నిర్వహించి రైతులకు ధాన్యం సేకరణపై అవగాహన కల్పించాలని సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ అపరాజిత సింగ్‌ మాట్లాడుతూ ధాన్యం సేకరణ కేంద్రముల వారి యొక్క గ్రామములో కనీసం పది వాహనాలను ధాన్యం రవాణాకు అందుబాటులో ఉండేలా చూసుకోవలన్నారు. జిల్లాలో ధాన్యం సేకరణ సజావుగా సాగుటకు అవసరమైన ఏర్పాట్లు అన్ని సిద్ధం చేసుకోవలసిందిగా ఆదేశించారు. అలాగే గ్రామ వ్యవసాయ సహాయకులు, ధాన్యం సేకరణ కేంద్రాల నిర్వాహకులు యొక్క సందేహాలను తెలుసుకుని నివత్తి చేశారు. ఈ కార్యక్రమము లో జిల్లా పౌర సరఫరాల మేనేజర్‌ డాక్టర్‌ ఏ. శ్రీధర్‌, జిల్లా పౌర సరఫరాల అధికారి వి.పార్వతి , జిల్లా పౌర సరఫరాల అసిస్టెంట్‌ మేనేజర్‌ (టెక్నికల్‌), సి.హెచ్‌. కోటి రెడ్డి , జిల్లా కోఆపరేటివ్‌ అధికారి వి. ఫణి కుమార్‌, మచిలీపట్టణం మండల వ్యవసాయ అధికారి డి.హారిక పాల్గొన్నారు.