Aug 05,2022 23:11

వరి నాట్లు వేస్తున్న మహిళలు

రెండు వారాలుగా ముఖం చాటేసిన వర్షాలు
వర్షాధార భూముల్లో కొనవాడిపోతోన్న వరినారు
వ్యవసాయ బోర్ల వద్ద జోరుగా వరినాట్లు
ప్రజాశక్తి - పద్మనాభం   
ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ఆదిలో అనుకూలించిన వర్షాలు ఆ తర్వాత ముఖం చాటేయడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. దీంతో వర్షాధార భూముల్లో ఇప్పటికే మొలకెత్తిన వరినారు కొనవాడిపోతుండగా, వ్యవసాయ బోర్లు వద్ద మాత్రం రైతులు జోరుగా వరి నాట్లు వేస్తున్నారు. ప్రస్తుతం విలాస్‌ఖాన్‌పాలెం, మద్ది, కృష్ణాపురం, పద్మనాభం, పాండ్రింగి తదితర .గ్రామాల్లో వ్యవసాయబోర్లు వద్ద దమ్ములు, వరినాట్లు ఊపందుకున్నాయి. ఆయా గ్రామాల్లో రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో పూర్తిగా నిమగమై ఉన్నారు. ప్రస్తుతానికి అక్కడక్కడా సాగు పనులు జరుగుతున్నప్పటికీ కూలీల కొరత ఎదురౌతుండగా, వర్షాలు కురిసి, పూర్తిస్థాయిలో వ్యవసాయ పనులు ఊపందుకుంటే కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వర్షాధార పొలాల్లో వాడిపోతున్న వరినారు
గడచిన పదిరోజులుగా వర్షాలు ఎత్తిపెట్టడంతో మండలంలోని వర్షాధార పొలాల్లో వేసిన వరినాట్లు కొనవాడిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. గతనెల మధ్యలో కురిసిన వర్షాలకు అన్నదాతలంతా సంబరపడి, ఆశావహ దృక్పథంలో నారుమళ్లుసిద్ధం చేసి, విత్తనాలు చల్లగా, ప్రస్తుతం వరినారు ఏపుగా పెరిగి నాటేందుకు సిద్ధంగానే ఉంది. అయితే వర్షాలు లేకపోవడంతో దమ్ములు, నాట్లు మాట అటుంచితే, ఇపుడు నారు వాడిపోతుండడంతో రైతులు కలవరపడుతున్నారు. వర్షాలు ఆలస్యమైతే నారు ముదిరి, పంట దిగుబడిపై ప్రభావం ఉంటుందని ఆవేదన చెందుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం మండలంలో 22 పంచాయతీల్లోని 6,250 ఎకరాలలో వరినాట్లు వేయడానికి రైతన్నలు సిద్ధంగా ఉన్నారు. దీంతో మండలంలోని ఐనాడ, బోత్సపేట, బిఆర్‌ తాళ్లవలస, రేవిడి, వెంకటాపురం., రెడ్డిపల్లి, తునివలస, నేరేళ్లవలస, కోయ్యపేట, చిన్నాపురం, అనంతవరం, కోవ్వాడ, .గంధవరం, పెంట తదితర గ్రామాల్లో వర్షాధార పొలాల రైతులు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు.