Oct 30,2023 23:41

ప్రజాశక్తి - పంగులూరు
గోవాలో జరుగనున్న జాతీయ స్థాయి ఖోఖో పోటీలలో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ ఖోఖో బాలుర జట్టుకు వైసీపీ ఇంచార్జ్, శాప్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య క్రీడా దుస్తులు అందజేశారు. గత ఐదు నెలలుగా స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలోని ఎస్‌ఆర్ఆర్ ఖోఖో అకాడమీలో జరుగుతున్న 37వ శిక్షణా శిబిరం సోమవారం అత్యంత ఘనంగా ముగిసింది. శిక్షణ ముగింపు సభలో వైసిపి ఇన్‌ఛార్జి బాచిన కృష్ణ చైతన్య, సర్పంచ్ గుడిపూడి నాగేంద్రం, రామారావు, జడ్పిటిసి రాయిని ప్రమీల వెంకట సుబ్బారావు, ఎంపీటీసీ నూతలపాటి వీర రాఘవులు, రోటరీ క్లబ్ అధ్యక్షులు కరణం హనుమంతరావు, రోటరీ క్లబ్ క్యాంప్ చైర్మన్ చిలుకూరి వీర రాఘవయ్య మాట్లాడారు.  క్రీడాకారులకు కృష్ణ చైతన్య చేతుల మీదుగా శాప్ వారు అందజేసిన క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ జాతీయ క్రీడల్లో మన రాష్ట్ర జట్టు ఉన్నత ప్రతిభ కనబరిచి పథకం సాధించి రాష్ట్రానికి, పుట్టిన ఊరికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. రాష్ట్ర క్రీడా ప్రాదికర సంస్థ (శాప్) విసి అండ్ ఎండి ధ్యాన్ చంద్ ఆర్థిక సహాయంతో ఆంధ్ర ఖోఖో అసోసియేషన్  ఆధ్వర్యంలో 5నెలలుగా ఎంతో క్రమశిక్షణతో శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణా శిబిరం పర్యవేక్షకులుగా కోచ్ డి లక్ష్మీనారాయణరెడ్డి, అసిస్టెంట్ కోచ్‌గా బ్రహ్మనాయుడు, సహాయకునిగా అంతర్జాతీయ క్రీడాకారుడు కర్రి శ్రీనివాసరావు, మేనేజర్ కె హనుమంతరావు, జాగర్లమూడి సుబ్బారావు వ్యవహరించనున్నారు. ఈ శిక్షణా శిబిరం మే 26న రాష్ట్ర క్రీడా శాఖ మంత్రివర్యులు  ఆర్‌కె రోజా చేతుల మీదుగా అత్యంత ఘనంగా ప్రారంభించారు. శాప్ విసి అండ్ ఎండి  హర్షవర్ధన్, కలెక్టర్ రంజిత్ భాష, ఆంధ్ర ఖో ఖో అసోసియేషన్  చైర్మన్ బాచిన చెంచుగరటయ్య, చీప్ పాట్రన్ ఉగ్ర నరసింహారెడ్డి, సెక్రటరీ ఎం సీతారామిరెడ్డి, ప్రెసిడెంట్ టిఎస్ఆర్‌కె ప్రసాద్,  ఎంవిఎస్ ప్రసాద్, ప్రకాశం జిల్లా  ఖో ఖో అసోసియేషన్ కార్యదర్శి బి కాశీ విశ్వనాథరెడ్డి, ప్రెసిడెంట్ కె భాస్కరరావు పాల్గొన్నారు. ఈ టీంకు శిక్షకులుగా డి లక్ష్మీనారాయణరెడ్డి, బ్రహ్మనాయుడు, కర్రి శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా కోచ్ పాల్ కుమార్, కె హనుమంతరావు పర్యవేక్షిస్తారని సీతారామిరెడ్డి చెప్పారు.