May 25,2023 00:18

ద్వితీయ స్థానం సాధించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా బాలురు జట్టు

ప్రజాశక్తి - పంగులూరు : విజయనగరంలో ఈనెల 21, 22, 23, తేదీల్లో రాష్ట్రస్థాయి అండర్‌ -19 బాలుర ఖోఖో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా బాలురు జట్టు రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా జట్టులోని 12 మంది ఖోఖో క్రీడాకారులు పంగులూరులోని మాగుంట సుబ్బరామిరెడ్డి,బాచిన నారాయణమ్మ జూనియర్‌ కళాశాల విద్యార్థులు కావడం విశేషమని ఆ కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ మేకల సీతారామరెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన బాలుర జట్టు, కోచ్‌ వెంకట్‌, పీడీ సీతారామిరెడ్డిని ఇంటర్మీడియట్‌ బోర్డు ఆర్‌ఐఒ సైమన్‌ విక్టర్‌, స్కూల్‌ గేమ్స్‌ అండర్‌ -19 సెక్రటరీ ఆదినారాయణ ఆంధ్ర ఖోఖో అసోసియేషన్‌ చైర్మన్‌ బాచిన చెంచు గరటయ్య, రాష్ట్ర శాప్‌ నెట్‌ చైర్మన్‌ బాచిన కష్ణ చైతన్య, మాగుంట కళాశాల చైర్మన్‌, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలో అత్యంత ప్రతిభ చూపిన కంచర్ల వెంకట్రావు, పొన్నగంటి గోపి, జనమాల విజరు కుమార్‌ వచ్చేనెల 6 నుంచి 10 వరకూ ఢిల్లీలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి అండర్‌ -19 స్కూల్‌ గేమ్స్‌ ఖోఖో పోటీలలో పాల్గొనున్నట్లు మేకల సీతారామిరెడ్డి తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను ఉమ్మడి ప్రకాశం జిల్లా ఖోఖో అసోసియేషన్‌ అధ్యక్ష ,కార్యదర్శులు కె. భాస్కరరావు, బి .కాశీ విశ్వనాథరెడ్డి, ఒంగోలు క్రాంతి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పి. చంద్రశేఖర్‌ రెడ్డి, బి. రమాదేవి, పీడీ సావిత్రమ్మ , పిఇటి కాశీ విశ్వనాథరెడ్డి, ఆర్‌. వెంకటేష్‌, శివనాగిరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు శివనాగిరెడ్డి, టీం మేనేజర్‌ వెంకటేశు,పీడీ సీతారాంరెడ్డి పాల్గొన్నారు.