ప్రజాశక్తి-బాపట్ల: రాష్ట్రంలో క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు ప్రభు త్వం క్రీడా రంగానికి పెద్ద పీట వేస్తుందని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి పేర్కొన్నారు. అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతిలో ఈ నెల 24న జరిగిన 4వ ఏషియన్ అంతర్జాతీయ ఖోఖో టోర్నమెంట్లో స్వర్ణ పతకం సాధించిన ఆట్ల శివనాగిరెడ్డిని కోన ప్రశంసించారు. బాపట్ల జిల్లా జె పంగులూరు క్రీడాకారుడు శివ నాగిరెడ్డిని ఆదివారం ఎమ్మెల్యే కోన రఘుపతి స్వగృహంలో సన్మానించారు. ఈ సందర్భంగా కోన మాట్లాడుతూ జె పంగులూరు గ్రామంలోని ఎస్‌ఆర్‌ఆర్ ఖోఖో అకాడమీ నుంచి ఎంతో మంది అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎంపికై ఉన్నత ఉద్యోగాలు సాధించటం అభినందనీయమని అన్నారు. బాపట్ల నియోజకర్గానికి చెందిన శివనాగిరెడ్డి ఏషియన్లో బంగారు పతకం సాధించి బాపట్ల ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. శివనాగిరెడ్డికి ప్రభుత్వపరంగా సాయం అందించేందుకు కృషి చేస్తామని కోన హామీ ఇచ్చారు. క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్న ఖోఖో అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి సీతారామిరెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా జిల్లా అధ్యక్షులు వై అశ్వనీరెడ్డి ఉన్నారు.










