గిరిజన ప్రాంతాలలో సహజ సిద్ధమైన సాధన వుంటుంది. విలు విద్యలో అద్భుత ప్రతిభ వుంటుంది. ఆర్చరీ, ఫుట్‌బాల్ కోచింగ్ ఇవ్వవచ్చు. బరువులు సులభంగా ఎత్తగలరు. వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ ఇవ్వవచ్చు. సత్తా వున్న ఆటగాళ్లను సైతం పట్టించుకోకపోవడంతో కుటుంబ పోషణ కోసం కూలీలుగా పని చేస్తున్నారు. వీధుల్లో పాలు, పండ్లు అమ్ముకుంటున్నారు. 'ఖేలో ఇండియా-ఫిట్ ఇండియా' అంటూ నినాదాలు, ఆచరణ లేని ఊకదంపుడు ఉపన్యాసాల వల్ల ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ వెనక్కే వుంటుంది.
ఒలింపిక్స్ 32వ విశ్వ క్రీడా సంగ్రామం జులై 23 నుండి ఆగస్టు 8 వరకు జపాన్‌లో జరిగింది. ఈ సందర్భంగా క్రీడా రంగం పట్ల ప్రభుత్వాల పాత్ర చర్చనీయాంశమైంది.
టోక్యో ఒలింపిక్స్ పతకాల పట్టికలో మొదటి నుండి ఆట చివరి రోజు వరకు చైనా నంబర్ వన్‌గా నిలుస్తూ వచ్చింది. అయితే చివరి రోజు మూడు గోల్డ్ మెడల్స్ రావడంతో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ జనాభాలో అగ్ర స్థానంలో వున్న చైనా 38 బంగారు పతకాలతో 2వ స్థానంలో నిలిచింది. చైనా 1984 నుండి కేవలం ఆరు క్రీడలపై మాత్రమే దృష్టి పెట్టింది. అవి...టేబుల్ టెన్నిస్, షూటింగ్, డైవింగ్, బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టింగ్. ఒలింపిక్ స్వర్ణాలలో దాదాపు 75 శాతం ఈ ఆరు ఆటల నుండే సాధించింది. ముఖ్యంగా మహిళ క్రీడాకారులను తయారు చేసింది. టోక్యో పర్యటన బృందంలో దాదాపు 70 శాతం మహిళలే. ఎక్కువ స్వర్ణాలు మహిళా ఛాంపియన్‌ల సౌజన్యంతోనే వచ్చాయి. దీన్నిబట్టి మహిళల ప్రాధాన్యత కూడా అర్ధమౌతుంది. చైనాలో గవర్నమెంట్ స్పోర్ట్స్ సెంటర్లు రెండు వేలకు పైగా వుంటే భారతదేశంలో 110 పైచిలుకు క్రీడా కేంద్రాలు మాత్రమే వున్నాయి. ప్రభుత్వ నిర్వహణలో ఎక్కువ పతకాలు సాధించే రాష్ట్రాలకు అధిక నిధులిస్తూ ఇండియా కంటే 200 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తోంది. చైనీస్ స్పోర్ట్స్ మిషన్ ఏకైక లక్ష్యం వేలాది మంది పిల్లలను చిన్నప్పటి నుంచే ప్రభుత్వ-నిర్వహణ క్రీడా పాఠశాలల్లో పూర్తి సమయం క్రమశిక్షణతో శిక్షణ ఇస్తోంది. ఇతర దేశాలు పెద్దగా ఆదరించని క్రీడలను ఎంపిక చేసుకుని తన ఖాతాల్లో ఘన విజయాలు సాధిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో సహజ నైపుణ్యాలు వున్న...సులభంగా బరువు ఎత్తగల, బాణాలు విసరగల ఫారెస్టులో ఏరియాలో వుండే యువతీ యువకులకు శిక్షణ ఇస్తుంది. 1988 ఒలింపిక్స్‌లో చైనా ఐదు స్వర్ణాలను గెలుచుకుంది. రెండు దశాబ్దాల తరువాత బీజింగ్‌లో యునైటెడ్ స్టేట్స్‌ను అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది. సోవియట్ యూనియన్ ముక్కలై విడిపోయినా 1992 స్పెయిన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో...అన్ని దేశాలు కలిసి ఒకే జట్టుగా పాల్గొని అమెరికాను వెనక్కి నెట్టి ప్రథమ స్థానం సంపాదించాయి. 2012 లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో చైనా 38 గోల్డ్ మెడల్స్ సాధించింది. అయితే 2016 రియో ఒలింపిక్స్‌లో నిరాశ మిగిల్చింది. యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్ తర్వాత చైనా 3వ స్థానంలో నిలిచింది.
ఒలింపిక్స్‌లో ఇండియా ఎక్కడ ?
124 మంది అథ్లెట్లతో టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత్‌కు ఈసారి ఏడు పతకాలే దక్కాయి. 48వ స్థానంలో నిలిచింది. గతంతో పోల్చి చూస్తే ఈసారి ఒక పతకం ఎక్కువ వచ్చినా, ఇతర దేశాలతో పోల్చి చూస్తే మనం ఎక్కడ ఉన్నామో అర్థమవుతుంది. కోటి 13 లక్షల జనాభా ఉన్న అతి చిన్న సోషలిస్ట్టు దేశం క్యూబా అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఏడు స్వర్ణాలతో సహా 15 పతకాలను సాధించి 14వ స్థానంలో నిలిచింది. మన పొరుగునే ఉన్న చైనాతో పోల్చితే చాలా వెనుకబడి ఉన్నామన్న సంగతి అర్థమవుతుంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలిసారి ఆరు పతకాలు దక్కాయి. అప్పటికి అదే గొప్ప. ఆ తర్వాత రియో ఒలింపిక్స్‌లో 2 పతకాలే దక్కాయి. ఈసారి టోక్యోలో భారత్‌కు ఒక స్వర్ణం, 2 రజితాలు, 4 కాంస్యాలు రావడంతో ఇప్పటికి ఇదే గొప్ప. 41 ఏళ్ళ తర్వాత హాకీ కి పతకం, 21 ఏళ్ల తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం, తొలిసారిగా అధ్లెటిక్స్‌లో స్వర్ణం వచ్చాయి. అందుకు దేశం ఉప్పొంగిపోయింది. ఒలింపిక్స్‌లో ఇంకో అంకె దాటడానికి భారత్‌కు ఇంకెన్నేళ్లు పడుతుందో! జనాభాలో చైనా, ఇండియా సరి సమానం. క్రీడా రంగానికి ఇచ్చే ప్రాధాన్యత, విధానాల్లో మాత్రమే తేడా. సామ్రాజ్యవాద దేశాలకు, భారతదేశ కమ్యూనిస్టు వ్యతిరేకులకు చైనా అంటే విపరీతమైన అక్కసు, ద్వేషం, కోపం. అంతేనా! ఆ ద్వేషం స్వదేశీ దళిత, పేద క్రీడాకారులను కూడా దూషించే స్థాయికి వెళ్లింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఇదే జరిగింది. భారత హాకీ జట్టులో దళిత క్రీడాకారులు వుండటం వల్ల టోక్యో ఒలింపిక్స్ సెమీస్‌లో ఓడిపోయారని దళిత క్రీడాకారిణి వందన కటారియా ఇంటి ముందు అగ్రవర్ణాలకు చెందిన యువకులు గొడవ చేసి, ఆమె కుటుంబాన్ని దుర్భాషలాడారు. క్రీడలకు కూడా కులాన్ని అంటగట్టే దరిద్రపుగొట్టు కులోన్మాదులు వున్న దేశం మనది. నిజానికి భారత హాకీ జట్టు అమ్మాయిలు అద్భుత ఆట తీరును ప్రదర్శించారు. కులం, మతం పేరుతో దేశాన్ని, ప్రజలను విభజించే భావజాలం కలిగిన పాలకులు వుండటం ఇలాంటి ఘటనలకు కారణం.
క్రీడా రంగాన్ని ప్రభుత్వాలు గాలికొదిలేయడంతో ప్రజల్లో ఆదరణ తగ్గింది. 1928 ఆమ్‌స్టర్‌డమ్ ఒలింపిక్స్ నుంచి 1936 బెర్లిన్ ఒలింపిక్స్ వరకూ భారత్‌కు మూడు బంగారు పతకాలు అందించిన హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాము. యువతలో స్ఫూర్తి నింపడంలో ప్రభుత్వాలు ఘోర వైఫల్యం చెందుతున్నాయి. అందుకే యువ జనాభా ఎక్కువగా ఉన్న మన దేశంలో క్రీడా దినోత్సవం గురించి ఎవరికీ పట్టినట్టు కనిపించదు. అదే వలెంటైన్స్ డే, ఫ్రెండ్‌షిప్ డేల గురించీ అడగకుండానే చెప్పేయగలరు. వ్యాపార పరమైన మీడియా ప్రభావం ఇందుకు కారణం. దేశంలో పుష్కరాలకు, యజ్ఞాలకు, ప్రార్ధనా మందిరాలకు, యాగాలకూ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ప్రజలను మూఢనమ్మకాల మత్తులో ముంచేస్తున్న ప్రభుత్వాలు క్రీడా రంగాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాయి.
నినాదం మాత్రమేనా
ఖేలో ఇండియా-ఫిట్ ఇండియా అంటూ తియ్యటి నినాదాలిచ్చే బిజెపి ప్రభుత్వం క్రీడా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. 2021-22 కేంద్ర బడ్జెట్‌లో క్రీడా శాఖలకు రూ. 2596.14 కోట్లతో సరిపెట్టి రూ.230 కోట్లు కోత పెట్టింది. క్రీడాకారులకు అందించే ప్రోత్సాహకాలను రూ.70 కోట్ల నుంచి రూ.53 కోట్లకు తగ్గిస్తున్నట్లుగా బడ్జెట్‌లో ప్రతిపాదించారు. జాతీయ క్రీడాభివృద్ధి నిధుల్లోనూ కత్తెర వేశారు. సగానికి సగం తగ్గించి ఈ మొత్తాన్ని రూ.25 కోట్లుగా నిర్ధారించారు. కామన్‌వెల్త్ క్రీడల సన్నాహాల బడ్జెట్‌ను రూ.75 కోట్లు నుంచి రూ.30 కోట్లకు తగ్గించిన కేంద్ర బిజెపి ప్రభుత్వం. అలాగే జాతీయ క్రీడాభివృద్ధి నిధి (ఎన్.ఎస్.డి.ఎఫ్)కి గతంలో రూ.77.15 కోట్లు ఇవ్వగా...ఇప్పుడు రూ.50 కోట్లతో సరిపెట్టారు. ఇక జాతీయ క్రీడా సమాఖ్యల కోసం రూ.245 కోట్లను కేటాయించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ.300.85 కోట్లతో పోల్చితే రూ. 55.8 కోట్లు కోత పెట్టారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సారు)కీ కోత తప్పలేదు. రూ.500 కోట్లు (గతంలో రూ.615 కోట్లు) కేటాయించారు. కరోనా కాలం కాబట్టి నిధులు కోత విధించామని కేంద్రం తప్పుడు వాదనలు చేస్తోంది. అదే కరోనా కాలంలో బడా పెట్టుడిదారులకు రూ.68,600 కోట్ల రూపాయల రాయితీలిచ్చింది. క్రీడలపై ఖర్చు అతి తక్కువ. ఒలింపిక్స్‌లో పతకాలు ఎలా వస్తాయి ?
గతంలో క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రత్యేక స్పోర్ట్స్ కోటా వుండేది. ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి కళాశాల స్థాయి వరకు వ్యాయామ ఉపాధ్యాయులు వుండేవారు, ఆటస్థలాలు వుండేవి. నేడు కార్పొరేట్, ప్రయివేట్ విద్యా సంస్థల ప్రాబల్యం పెరిగిన తర్వాత ఆటస్థలాలు కనిపించడం లేదు. 90 శాతం పైగా పాఠశాలలో ఆట స్థలాలు లేవు. క్రీడా పోటీలకు ప్రభుత్వ పాఠశాలల నుంచి 80 శాతం మంది విద్యార్థులు ఎంపిక అవుతుండగా ప్రైవేట్ పాఠశాల నుంచి 20 శాతం మాత్రమే. అయినా ప్రైవేట్ వైపే ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి. నిజానికి యువతలో అనేక రకాల కళా క్రీడా నైపుణ్యాలు వున్నాయి. గిరిజన ప్రాంతాలలో సహజసిద్ధమైన సాధన వుంటుంది. విలు విద్యలో అద్భుత ప్రతిభ వుంటుంది. ఆర్చరీ, ఫుట్‌బాల్ కోచింగ్ ఇవ్వవచ్చు. బరువులు సులభంగా ఎత్తగలరు. వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ ఇవ్వవచ్చు. సత్తా వున్న ఆటగాళ్లను సైతం పట్టించుకోకపోవడంతో కుటుంబ పోషణ కోసం కూలీలుగా పని చేస్తున్నారు. వీధుల్లో పాలు, పండ్లు అమ్ముకుంటున్నారు. ఖేలో ఇండియా-ఫిట్ ఇండియా అంటూ నినాదాలు, ఆచరణ లేని ఊకదంపుడు ఉపన్యాసాల వల్ల ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ వెనక్కే వుంటుంది. ప్రభుత్వాలు కళ్లు తెరిచి, నిర్లక్ష్యం విడనాడి క్రీడా రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
/ వ్యాసకర్త సెల్ : 94940 76092 /
దాస్ వంతాల











