Jul 14,2023 01:54
మాట్లాడుతున్న ఆర్డీవో జగన్నాథం పార్థసారథి

ప్రజాశక్తి-రేపల్లె: ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితమైన ఓటర్ల జాబితాను ప్రకటించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని రెవెన్యూ డివిజన్‌ అధికారి జగన్నాథం పార్థసారధి అన్నారు. పట్టణంలోని సీతారామ యోగిని కల్యాణ మడపంలో గురువారం సాయంత్రం నియోజకవర్గంలోని నాలుగు మండలాలోని బీఎల్వోలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితాను ఎటువంటి తొప్పొప్పులకు తావివ్వకుండా సరిచేయాల్సిన బాధ్యత బీఎల్వోలపై ఉందని అన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జులై 21వ తేదీ నుంచి ఆగస్ట్‌ 21వ తేదీ వరకు బీఎల్వోలు ఇంటింటి సర్వే నిర్వహించాలన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలన్నారు. 2024 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు నూతనంగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునేలా చైతన్యపరిచి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ఇంటింటి సర్వేలో ఒకే డోర్‌నంబర్‌లో అధికంగా ఉన్న ఓట్లను గుర్తించి మండల స్థాయి అధికారులకు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో నాలుగు మండలాల తహశీల్దార్లు, బూత్‌లెవల్‌ అధికారులు పాల్గొన్నారు.