జిల్లా జడ్జి పురుషోత్తమకుమార్, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
జిల్లా జైలులో ఘనంగా గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవం
ప్రజాశక్తి - ఏలూరు
ఖైదీలలో సత్ప్రవర్త తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జిల్లా జడ్జి సిహెచ్.పురుషోత్తమ కుమార్, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా జైలులో నిర్వహించిన ఖైదీల సంక్షేమ దినోత్సవంలో గాంధీ విగ్రహానికి వారు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కెకెవి.బుల్లికృష్ణ, జైలు సూపరింటెండెంట్ సిహెచ్‌ఆర్‌వి.స్వామి, జైలర్లు కె.వెంకటరెడ్డి, కె.శ్రీనివాసరావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.పురుషోత్తమకుమార్ మాట్లాడుతూ రిమాండ్ ఖైదీలకు సంబంధించిన కేసులను త్వరగా విచారణచేసి విడుదలకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కమ్యూనికేషన్‌లో జాప్యం లేకుండా రిలీజ్ ఆర్డర్లు సత్వరజారీకి చర్యలు తీసుకుం టామన్నారు. రిమాండ్ ఖైదీలకు అవసరమైన ఉచిత న్యాయసహాయాన్ని అందించబడుతుందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా న్యాయసహాయం అందించేందుకు ముగ్గురు న్యాయవాదులను గుర్తించి నియమించామన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి న్యాయవ్యవస్థలో పెద్దఎత్తున మార్పులు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కోవిడ్-19 అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమవాదనలు వినిపించుకునే అవకాశం సుప్రీంకోర్టు కల్పించిందన్నారు. సమాజానికి ఉపయోగపడే రీతిలో ఖైదీల్లో పరివర్తన తీసుకువచ్చేందుకు అన్ని రకాలప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఖైదీలను బాధ్యతాయుతంగా తీర్చిదిద్దేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ కింద వారికి నచ్చిన వృత్తుల్లో నైపుణ్యం పొందేందుకు శిక్షణా కార్యక్రమాలు కూడా అమలు చేయబడతాయన్నారు. కుటుంబాన్ని వదలి జైలులో ఒంటరిగా ఉండి కుంగుపాటుకు గురయ్యే వారిని గుర్తించి వారిలో మానసిక స్ధైర్యాన్ని పెంచేందుకు మానసిక వైద్య నిపుణుల సేవలను అందిస్తామన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ అహింసా మార్గానికి గాంధీ ఒక సింబల్‌గా నిలుస్తారన్నారు. సమాజంలో ఉద్రేకపూరిత వాతావరణంలో కానీ ఇతర పరిస్ధితుల ప్రభావం వల్లకానీ తప్పులు అందరూ చేస్తారని, అయితే వారిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మార్పు కోరుకునేవారు సమాజంలో మంచి వ్యక్తిగా నిలుస్తారన్నారు. ఖైదీల సంక్షేమం కోసం అమలవుతున్న పలు అంశాలను, సంస్కరణలను ఆయన వివరించారు. జైలు నిర్వహణలో అనేక సంస్కరణలు తీసుకురావడం ద్వారా జైలు ఒక ఆశ్రమంగా నిలిచి ఖైదీల జీవనశైలిలో మార్పుకోసం, వారిలో పరివర్తనకోసం ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వాలు చేపట్టాయన్నారు. వృత్తినైపుణ్య కార్యక్రమాలు చేపట్టబడ్డాయన్నారు. ఈ విషయాల్లో మనరాష్ట్రం నాందిగా నిలిచిందన్నారు. అంతేగాకుండా ఎదో నేరం చేశామని, కుటుంబానికి దూరంగా ఉంటున్నామని ఒంటరిగా ఉండే ఖైదీల జీవనశైలి, మానసిక ప్రవర్తన మార్చేందుకు కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. ఇందుకోసం ఎన్‌జిఒల సహకారం తీసుకోవడంతో పాటు మానసిక వైద్యల సేవలను కూడా అందిపుచ్చుకోవాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి మానసిక వైద్యులను పంపుతామని చెప్పారు. అదే విధంగా నషాముక్తా భారత్ అభియాన్ కింద మారకద్రవ్యాల వినియోగాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఖైదీల్లోకూడా పరివర్తన తీసుకురావల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం జిల్లాన్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవివి.బుల్లికృష్ణ మాట్లాడుతూ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కింద రిమాండ్ ఖైదీలకు న్యాయసహాయాన్ని ఉచితంగా డిఎల్ ఎసి తరపున అందిస్తున్నామన్నారు. తరచూ తాము జైలును సందర్శించి ఖైదీలకు ఉచిత న్యాయసహాయం అందించడంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. యూటిఆర్‌సి కింద ఈనెలలో నాలుగుసార్లు సమావేశాలు నిర్వహించామన్నారు. ఇప్పటికే రూ.25 లక్షల విలువైన ఉచిత న్యాయ సహాయం అందించామన్నారు. మహిళా బ్లాక్‌లో బేకరీ ఏర్పాటు ద్వారా ఉపాధి కల్పించారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమం రూపొందించామన్నారు. ఆనంతరం గాంధీ జయంతి సందర్బంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన ఖైదీలకు బహుమతులు అందజేశారు. అనంతరం నాట్యాచార్య డి.హేమసుందర్ శిష్యబృందంచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో డిఎల్‌ఎస్‌ఎ డిఫెన్స్ న్యాయ వాదులు పివిఎన్.మునేశ్వరరావు, బి.రామ్మోహన్, టి.మధు, ఫామిలీ వెల్పేర్ న్యాయవాదులు కూన వెంకటేశ్వరరావు, పి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.










