Aug 17,2023 20:03

సమావేశంలో మాట్లాడుతున్న బాబురాజు

ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని సబ్‌ జైలులో జైలర్‌ నజీర్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో గురువారం ఖైదీలకు టిబి, హెచ్‌ఐవిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌పిహెచ్‌ఎస్‌ బాబు రాజు, పిపిఎం సుధాకర్‌, హెచ్‌ఐవి కౌన్సిలర్‌ శివజ్యోతి మాట్లాడారు. రెండు వారాలు మించి దగ్గు, దగ్గులో రక్తపు ఛారలు, ఉదయం, సాయంత్రం జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం తదితర లక్షలు ఉంటే టిబిగా అనుమానించాలని తెలిపారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మాస్కులు ధరించాలని, పుట్టిన వెంటనే పిల్లలకు బిసిజి వేయించాలని సూచించారు. మనిషికి మనిషికి మధ్య రెండు మీటర్ల దూరం ఉండడం తదితర జాగ్రత్తలు పాటించాలన్నారు. హెచ్‌ఐవి రాకుండా అపరిచితులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోరాదని తెలిపారు. రక్త మార్పిడి నుంచి జాగ్రత్త తీసుకోవాలని, ఒకరు వాడిన సూదులను మరొకరు వాడరాదని, తదితర జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. టిబిహెచ్‌వి కె.లలితమ్మ, ఎల్‌టి యాస్మిన్‌, సబ్‌ జైలు సిబ్బంది పాల్గొన్నారు.