ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి అర్హత ఉన్నా అనేకమందికి అమ్మఒడి పథకంలో అవకాశం దక్కలేదు. వివిధ నిబంధనలు పేరుతో ప్రభుత్వం పలువురిని పక్కన పెట్టింది. కొంతమందికి అమ్మఒడి అందుతుందని జాబితాలో పేర్లు ఉన్నా ఖాతాల్లో నేటికీ సొమ్ములు జమ కాలేదు. ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి మూడు రోజులు దాటిందని, నేటికీ డబ్బులు పడలేదని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న పలువురు తల్లులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఈ ఏడాది 1,86,708 మంది ఖాతాల్లో రూ.280.06 కోట్లు సొమ్ము వేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. అత్యధికంగా కాకినాడ అర్బన్‌లో 25,170 మందికి ఒక్కొక్కరికీ రూ.13 వేల చొప్పున రూ.32.72 కోట్లు, కాకినాడ రూరల్లో 14,309 మందికి రూ.18.60 కోట్లు, తుని మండలంలో 12,156 మంది ఖాతాల్లో రూ.15.80 కోట్లు, సామర్లకోట 12,044 మందికి రూ.15.66 కోట్లు, పెద్దాపురంలో 11,049 మందికి రూ.14.36 కోట్లు, పిఠాపురంలో 10979 మందికి రూ.14.27 కోట్లు, తొండంగి మండలంలో 8940 మందికి రూ.11.62 కోట్లు, తాళ్లరేవు 8260 మందికి రూ.10.74 కోట్లు జమ అయ్యాయని అధికారులు తెలిపారు.
జమ కాని సొమ్ములు
గత నెల 28న ముఖ్యమంత్రి జగన్ అమ్మఒడి సొమ్ములు జమ చేస్తున్నట్లు ప్రకటించారు. మూడు రోజులు దాటినప్పటికీ 90 శాతం మంది ఖాతాలలో నేటికీ సొమ్ములు జమ అవ్వలేదు. గత మూడు రోజులుగా తిరుగుతున్నాం, బ్యాంకు సిబ్బందిని అడుగుతుంటే ఇంకా జమ కాలేదు. మళ్ళీ రండి అని వెనక్కి పంపుతున్నారని పిఠాపురం మండలం మల్లం యూనియన్ బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న లబ్ధిదారులైన రంగనాథం వీరమణి, వెన్నా దేవి, రంగనాథం ప్రభావతి, కందికొండ అమరావతి తదితరులు తెలిపారు.
నానాటికీ తగ్గుతున్న లబ్ధిదారులు
వివిధ నిబంధనలను విధించిన ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యను కుదిస్తూ వస్తోంది. ప్రధానంగా విద్యుత్తు వినియోగం 300 యూనిట్లు దాటకూడదనే నిబంధన వల్ల అనేకమంది అర్హులకు కూడా అమ్మబడి లబ్ధి చేకూరని పరిస్థితి నెలకొంది. ఈ వేసవిలో విద్యుత్ వినియోగం అధికంగా ఉండడంతో పేద, సామాన్య వర్గాలు సైతం పరిమితికి మించి విద్యుత్తు వాడకం చేశారు. గతేడాది 2022-23లో 1,88,157 మంది తల్లుల ఖాతాల్లో రూ.282.23 కోట్లు వేశారు. ఈ ఏడాది 1,449 మందికి రూ.2.17 కోట్లు కోత విధించారు. నాలుగేళ్లుగా పథకం ప్రారంభమైన రోజునే తల్లుల ఖాతాల్లో సొమ్ములు జమ అవుతుండగా ఈ ఏడాది ఇంకా పడకపోవడంతో పలువురు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను అడుగుతుంటే తమకు సమాచారం తెలియదని బదులిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవడి డబ్బులు ఎప్పుడు అందుతాయో అని పలువురు ఆందోళన చెందుతున్నారు.










