Sep 09,2023 21:26

ప్రజాశక్తి - మండవల్లి
    నగదు రహిత లావాదేవీలపై ఖాతాదారులు అవగాహన కలిగి ఉండాలని ఇండియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ బొంతు దుర్గారావు స్పష్టం చేశారు. స్థానిక బిసి కాలనీలో సచివాలయం కన్వీనర్‌ బుంగ రాణి అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బ్యాంకు సేవలు, ఆర్థిక అక్షరాస్యతలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన జ్యోతి బీమా యోజన పథకంతో పాటు అటల్‌ ఫించన్‌ యోజన పథకాలను ప్రతిఒక్కరూ కలిగి ఉండాలన్నారు. పేద వర్గాలకు చెందిన వారందరూ పిఎం ఆర్థిక భరోసా పథకాలు వినియోగించుకొని కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన బ్యాంకు మిత్ర పాయింట్లు, ఎటిఎం సదుపాయాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇండియన్‌ బ్యాంకు అందిస్తున్న సేవలపై అవగాహన కలిగేలా గ్రామాలలో అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక జిల్లా కన్వీనర్‌ ఎల్‌ఎస్‌ భాస్కరరావు, మండల అధ్యక్షుడు టి.అప్పారావు, పి.లక్ష్మీ కుమారి, కె.విజయ కుమారి, ఎం.వెంకటరమణ, జి.చిట్టెమ్మ, ఎన్‌.వరలక్ష్మి, ఆర్‌.నాగలక్ష్మి, కె.వెంకటలక్ష్మి, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.