Aug 12,2023 23:56

క్రోసూరు: దొడ్లేరు చైతన్య గ్రామీణ గోదావరి బ్యాంకు ఖాతా దారుల బంగారం గోల్‌మాల్‌ వ్యవహారంపై సమగ్ర విచా రణ చేసి, ఖాతాదారులకు భరోసా కల్పించి, పూర్తి న్యాయం చేయా లని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి. రవిబాబు అన్నారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రవిబాబు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం బ్యాంకు వద్ద ఉన్న ఖాతాదారులతో, తనిఖీ కోసం వచ్చిన బ్యాంక్‌ అధికారులతో చర్చించినట్లు చెప్పారు. బ్యాంక్‌ గోల్డ్‌ అప్రైజర్‌ గా ఉన్న నాగార్జున పథకం ప్రకారం ప్రతి గ్రామానికి కొంతమంది బినామీలను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా లావాదేవీలు నడిచేలా చేశారని చెప్పారు. ఖాతాదారుల బంగారాన్ని తాకట్టు పెట్టిన సందర్భం లేదా రెన్యువల్‌ చేసిన సందర్భంలో ఎక్కువ మందికి అసలు రశీదులు ఇవ్వకపోవడం, ఒకవేళ రశీదులు ఇచ్చినప్పటికీ తనఖా పెట్టుకున్న వస్తువుల వివరాలు రాసి ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఖాతాదారులు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు. రశీదు ఇవ్వాలని ఖాతాదారులు అడిగితే రేపు,మాపు ఇస్తామని దాటవేస్తారని చెప్పారని అన్నారు. నాలుగైదు వస్తువులు తనఖాపెట్టగా అందులో రెండు,మూడు వస్తు వులు మాత్రమే ఉన్నాయని ఆయా ఖాతాదారులు చెప్పా రని అన్నారు. తనఖా పెట్టిన తమ వస్తువులు కనపడ కుండా పోయిన ఖాతాదారులు కన్నీరు పెడుతున్నారని, కష్టపడి సంపాదించుకున్న బంగారం కనపడకుండా పోయిందని, తమకు న్యాయం జరుగుతుందో లేదో అని ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. అప్రైజర్‌ నాగార్జున పై భరోసాతో మేనేజర్‌, సిబ్బంది వదిలి వేయడంతో, తాకట్టు పెట్టిన బంగారంలో కొంత భాగాన్ని తాను తయారు చేసుకున్న కొంతమంది బినామీల పేర్లపై మళ్లీ ఇదే బ్యాంకులో తనఖా పెట్టినట్లు ప్రాథమిక విచారణలో నిరా ్ధరణకు వచ్చిందని విచారణ కోసం వచ్చిన బ్యాంక్‌ అధికారులు చెప్పారని అన్నారు. ఖాతాదారులు తమ బంగారం ఉందో లేదో చూసుకునేందుకు వచ్చే నెల రెండు ,మూడు తేదీల వరకు స్లిప్పులు ఇస్తున్నారని, అప్పటివరకు తమ బంగారం ఉందో లేదో అనే సమాచారం తెలియక ఖాతాదారులు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవు తున్నారని అన్నారు. బ్యాంకు ఉన్నతస్థాయి అధి కారులు ఖాతాదారుల తోటి సమావేశాలు నిర్వహించి వారికి భరోసా కల్పించాలని కోరారు. ప్రతి ఖాతాదారుడికి ఒక గ్రాము కూడా నష్టం జరగకుండా పూర్తి న్యాయం చేయా లని లేకుంటే ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చ రించారు. సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి టి. హనుమంతరావు పాల్గొన్నారు.