Aug 02,2023 22:26

ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు

మడకశిర : పట్టణంలోని చౌటిపల్లి ఎస్సీ కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యపై కాలనీ మహిళలు మున్సిపల్‌ ఆఫీస్‌ ఎదుట ఖాళీబిందెలతో బుధవారం నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తమ కాలనీలో తీవ్ర తాగు నీటి ఎద్దడి నెలకొందన్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అలాగే వీధిదీపాలు, రోడ్డు సమస్య నెలకొందన్నారు. తమ కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. వీరి ఆందోళనకు సిపిఎం రామాంజనేయులు, సిపిఐ పవిత్ర మద్దతు పలికారు. కాలనీవాసుల సమస్యపై మున్సిపల్‌ కమిషనర్‌తో చర్చించారు. సమస్య పరిష్కరించకపోతే మున్సిపల్‌ కార్యాలయానికి తాళం వేసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు రత్నమ్మ, అక్కమ్మ, శివమ్మ, రామాంజమ్మ, భాగ్యమ్మ, ముత్తమ్మ, నరసమ్మ, అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు.