
తెనాలిరూరల్: ఖాళీ స్థలాల్లో మొలిచిన పిచ్చిచెట్లను ఎప్పటికప్పుడు తొలిగించాలని మున్సిపల్ కమిషనర్ ఎం. జశ్వంతరావు సూచించారు. పిచ్చి మొక్కలను తొలిగించినచోట, మెర కలు తోలించి నీటి నిల్వ లేకుండా చూడాలని ఖాళీ స్థల యజమానులకు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. తెనాలి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 14వ వార్డు శ్మశానం రోడ్డులోని ఖాళీ స్థలాల్లో దోమల నివారణకు ప్రకటన బోర్డులు ఏర్పాటు చేశారు. నివారణ చర్యల్లో భాగంగా దోమలు చేరకుండా నీటి నిల్వ ఉన్న ప్రదేశాల్లో ఆయిల్ బాల్స్ వేసి యాంటీ లార్వల్ ఆయిల్స్ పిచికారీ జరిపించినట్లు మున్సిపల్ వైద్యాధికారిణి కెహెచ్ నిర్మల తెలిపారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో దోమలు అభివృద్ధ్ది చెందే కాలమైనందున ప్రజలు తమ పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. కార్యక్రమంలో పారిశుధ్య అధికారి ఎ.రామచంద్రరావు, డి.శ్రీనివాసరావు, వై.అనుపమ, ఎంపిహెచ్‌ఇఒ ఎ.చంద్ర మౌళి, శానిటేషన్ సెక్రటరీలు ఎన్. ప్రవీణ్ కుమార్, ఎం.శాంతి ప్రియదర్శిని, కె.సంధ్య, జి.చంద్ర శేఖర్, నగర దీపికలు పాల్గొన్నారు.