ప్రజాశక్తి - గుంటూరు : నగరపాలక సంస్థ ఓపెన్, రిజర్వ్ స్థలాలను స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయనున్నామని, ఎక్కడైనా ఆక్రమణలుంటే తొలగించడానికి పట్టణ ప్రణాళికాధికారులు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశించారు. గుజ్జనగుండ్ల, బాపయ్య నగర్, ఇన్నర్ రింగ్ రోడ్, రెడ్డిపాలెం, గోరంట్లలోని పలు ప్రాంతాల్లో నగరపాలక సంస్థకు చెందిన రిజర్వ్, ఓపెన్ స్థలాలను కమిషనర్ మంగళవారం పరిశీలించారు. ఖాళీ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా పార్క్‌లు, ఆట స్థలాలుగా అభివృద్ధి చేస్తామని, పార్క్‌ల నిర్వహణలో స్థానికులను భాగస్వామ్యం చేస్తామని అన్నారు. పార్కుల్లో ప్రదానంగా వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల ఆట వస్తువులు, పచ్చదనం పెంపు ఉండాలని, గుర్తించిన పార్కుల్లో బాస్కెట్ బాల్, షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థకు చెందిన స్థలాల గుర్తింపు, ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. పర్యటనలో సిటీప్లానర్ ప్రదీప్ కుమార్, ఎస్‌ఇ భాస్కర్, ఇఇ సుందర్రామిరెడ్డి, డిప్యూటీ సిటీప్లానర్ కోటయ్య, ఎడిహెచ్ రామారావు, ఎఏసిపి అజరు కుమార్, డిఇఇ రఫిక్, శివకుమార్, ఎఇలు, టిపిస్‌లు, సచివాలయ ప్లానింగ్, ఎమినిటి కార్యదర్శులు పాల్గొన్నారు.
స్థలాలను పరిశీలిస్తున్న కమిషనర్ కీర్తి చేకూరి










