Dec 19,2022 23:38

ప్రజాశక్తి-విజయవాడ: ఆశ వర్కర్ల ఖాళీ పోస్టులను ప్రభుత్వమే ప్రత్యక్షంగా నియామకాలు చేపట్టాలని ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.కమల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని కోరారు. ఈ సందర్భంగా కమలా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కోవిడ్‌ కాలంలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ గా, అనేక సేవలు అందించిన ఆశ వర్కర్లు, ఇటీవల కాలంలో యాక్సిడెంట్స్‌, పని ఒత్తిడితో, ఇతర అనారోగ్య సమస్యల వలన, అనేకమంది మరణించారని, ఆశా ఖాళీ పోస్టులు భర్తీ సందర్భంగా ఆయా కుటుంబాల్లో అర్హులైన వారికి అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. ఇటీవల ఎన్టీఆర్‌ జిల్లాలో 99 ఆశా వర్కర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారని, వాటి నియామకాన్ని విలేజ్‌ శానిటేషన్‌ కమిటీలకు అప్పజెప్పడంతో, గ్రామాల్లో రాజకీయ నాయకులు జోక్యం పెరిగిందని అన్నారు. సచివాలయం పరిధిలో ఉన్న గ్రామాల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడంతో, మానేసిన ఆశ వర్కర్‌ పనిని కూడా ఉన్న ఆశ వర్కర్‌తో చేయించడం వలన, పని భారంతో ఆశ వర్కర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అంతేకాకుండా గత రెండు సంవత్సరాల నుండి , దసరా మహోత్సవాలు, భవాని దీక్షల సందర్భంగా, ఆశ వర్కర్లు, నైట్‌ డ్యూటీలు తో సహా మూడు షిఫ్ట్‌ లు వారిగా, డ్యూటీలు చేస్తున్నారని, వారికి టిఎ, డిఎలు చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. వారి సొంత ఛార్జీలు పెట్టుకుని డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆమె ఆరోపించారు. కావున దసరా మహౌత్సవాలు భవాని దీక్షలు సందర్భంగా డ్యూటీలు చేసిన ఆశ వర్కర్ల అందరికీ టిఎ, డిఎలు చెల్లించాలని ఆమెకోరారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పి. శ్రీలక్ష్మి, జిల్లా నాయకురాలు పి.పద్మావతి, దయాన రోజి తదితరులు పాల్గొన్నారు.