Dec 12,2022 23:34

  • ఆస్పత్రి పరిశీలనలో సిపిఎం రాష్ట్ర నాయకులు బాబూరావు డిమాండ్‌

ప్రజాశక్తి-విజయవాడ: అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ఆ సెంటర్లలో వైద్య సేవలను మెరుగుపర్చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు డిమాండ్‌ చేశారు. సోమవారం కండ్రిక అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను ఆయన సందర్శించి రోగులు, ప్రజలు, సిబ్బందితో మాట్లాడారు. రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది తగినంత మంది లేనందున పూర్తి స్థాయిలో సేవలు అందడంలేదన్నారు. కార్పొరేట్‌ హాస్పిటళ్లలో వైద్యం అత్యంత ఖరీదైన నేపథ్యంలో అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో వైద్య సేవలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని జబ్బులకు వైద్య సేవలందించాలని కోరారు, డాక్టర్లను, సిబ్బందిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఖాళీగా ఉన్న లాబ్‌ టెక్నీషియన్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, స్వీపర్‌ పోస్టులను భర్తీ చేయాలన్నారు. థైరాయిడ్‌, టైఫాయిడ్‌ తదితర పరీక్షలు చేయాలని, మందులను అందుబాటులో ఉంచాలని అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు 15 రోజులకు సరిపడా మందులు ఇవ్వాలని కోరారు. ఎక్స్‌ రే యూనిట్లను ప్రతి అర్బన్‌ హెల్త్‌ సెంటర్లో ఏర్పాటు చేయాలన్నారు. సింగ్‌నగర్‌, పాయకాపురం ప్రాంతంలో స్కానింగ్‌ సెంటర్‌ నెలకొల్పాలని కోరారు. ఈ పర్యటనలో సిపిఎం సెంట్రల్‌ సిటీ కార్యదర్శి బి.రమణారావు, నగర నాయకులు కె.దుర్గారావు, జి.ఝాన్సీ రాణి, స్థానిక నాయకులు సురేష్‌, పి.సాంబరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.