Sep 20,2023 21:44

నిరసన తెలుపుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి - గుంటూరు : సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌లో విద్యార్థులకు మెస్‌ ఛార్జీలను వెంటనే పెంచాలని భారీ విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద బుధవారం ఖాళీ ప్లేట్లతో నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగం సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, హాస్టల్‌ విద్యార్థులకు వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించారు హాస్టల్‌ విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్‌ఛార్జీలు లేకపోవడం వల్ల నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. పెరిగిన ధరలకు, మెస్‌ చార్జీలకు ఏమాత్రమూ సంబంధం లేదని. నెలకు కనీసం రూ.2500 ఇస్తేనే విద్యార్థులు మూడుపూటలా తినగలుగుతారని అన్నారు. హాస్టళ్లను అద్దె భవనాల్లో నిర్వహించడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, గుంటూరు నగరంలోని కోడిగుడ్‌ సత్రం హాస్టల్‌ ప్రారంభిస్తే అనేకమంది విద్యార్థుకు సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. అయితే ఆ హాస్టల్‌ను ప్రారంభించకుండా అధికారులు, ప్రజాప్రతినిదులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతంలో హాస్టల్‌ విద్యార్థులకు ప్రభుత్వమే నోట్‌ బుక్స్‌, యూనిఫామ్‌ ఇచ్చేదని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని నిలిపేసిందని, కాస్మోటిక్‌ చార్జీలు రూ.150 ప్రతినెలా ఇవ్వాలని నిర్ణయించినా ఇంకా ఒక్కరికి కూడా చెల్లించలేదని తెలిపారు. ఈ సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, మెస్‌ఛార్జీలను పెంచకుంటే చలో విజయవాడ నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే సమీర్‌, సుభాష్‌, సుచరిత, సహాయ కార్యదర్శి పవన్‌, నాయకులు భరత్‌ చంద్‌, ఆరిఫా, భగత్‌ సింగ్‌, ప్రశాంతి, సాత్విక్‌ పాల్గొన్నారు.