Apr 08,2023 23:34

ఆంద్ళోన చేపడుతున్న గిరిజన మహిళలు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: అడపవలస గ్రామంలో తాగునీటి పథకాన్ని మరమ్మత్తు చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతూ కడప వలస రోడ్డు వద్ద ఖాళీ బిందెలతో గ్రామస్తులు బైఠాయించారు. పలుమార్లు సంబంధిత శాఖ అధికారులకు విన్నవించినా అధికారులు పట్టించుకోక పోవడంతో శనివారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆంధ్ర, ఒడిశా రోడ్డుపై ఖాళీ బిందెలతో గిరి మహిళలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేయడం సరికాదని, తక్షణమే పరిష్కరించాలని గ్రామస్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు. టి సూర్యనారాయణ మాట్లాడుతూ, అడపవలసలో గత మూడు వారాల నుంచి కరెంట్‌ మోటారు మరమ్మతుకు గురవడంతో మంచినీరు లేక గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాగునీటి విద్యుత్‌ మీటర్‌ మరమ్మతుల కోసం ప్రతి కుటుంబం వద్ద నుంచి రూ.100 నుంచి 200ల చొప్పున వసూళ్లు చేసి ఇచ్చినా నేటికి కరెంటు బోరు మరమ్మతు చేయ లేదన్నారు. దీంతో, ఎండను లెక్క చేయకుండా ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో ఆందోళన చేయడం జరిగిందని చెప్పారు. రెండు రోజుల్లో మంచినీటి సమస్య తీరుస్తామని సచివాలయం ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ రాజబాబు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో గ్రామవార్డు సభ్యులు చెడ్డ మంజుల, తామర్ల కుమారి, అధిక సంఖ్యలో గ్రామ మహిళలు పాల్గొన్నారు.