Jul 04,2023 23:59

మాట్లాడుతున్న మహిళలు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని కొర్రాయి పంచాయతీ చిన్న అంజోడా గ్రామంలో తాగునీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆ గ్రామ మహిళలు ఖాళీ బిందెలతో ఆ గ్రామం వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ గ్రామస్తులు మాట్లాడుతూ, గ్రామంలో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు జల జీవన్‌ ద్వారా బోరు నిర్మించి ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నీళ్లు రాకపోవడంతో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పని పరిస్థితుల్లో పొలంలోని బురద నీటిని సేకరించి ఉపయోగిస్తున్నామని, దీంతో వ్యాధులకు గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామస్తులు వి స్వాతి, బి.సుమోని, బి.రాంబాబు, పి.పురుషోత్తం పాల్గొన్నారు.