Apr 02,2023 23:53

ఆందోళన చేపడుతున్న గ్రామస్తులు

పజాశక్తి-డుంబ్రిగూడ:మండలంలోని సాగర పంచాయతీ అడపవలస గ్రామంలో తాగునీరు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆ గ్రామస్తులు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో ఆదివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.సూర్యనారాయణ మాట్లాడుతూ, అడపవలస గ్రామంలో 70 కుటుంబాలు ఉన్నాయన్నారు. గత మూడు వారాల నుంచి గ్రామంలో తాగునీటి సౌకర్యం లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గతంలో మంచినీటి బోరు మరమ్మతులు గురైనప్పుడు ఒక్క కుటుంబం నుంచి వంద చొప్పున వసూలు చేసి మరమ్మత్తు చేసుకోవడం జరిగిందన్నారు. అయినా సరే ఎటువంటి ఉపయోగం లేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సౌకర్యం లేక పోవడంతో తీవ్ర ఇబ్బందలకు గురవుతున్నామని తెలిపారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి అడుపవలస గ్రామంలో పర్యటించి తాగునీటి సదుపాయం కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సిహెచ్‌ మంజుల, ఆ గ్రామ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.