ప్రజాశక్తి-పాడేరు:అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం మారుమూల ప్రాంతమైన కుంతుర్ల పంచాయతీ బర్రేమామిడి గ్రామంలో మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామంలోని మహిళలు ఖాళీ బిందెలతో సోమవారం నిరసన చేపట్టారు. రక్షిత మంచినీటి కొరతతో తాము వ్యాధుల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. బర్రె మామిడి గ్రామంలోని ఏడు వీధులలో 120 కుటుం బాలు నివసిస్తున్నాయని, గత కొంతకాలంగా మంచినీటి సమస్యతో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. గత్యంతరం లేక కొండవాలులో నీటిని సేకరిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలకు తాము సేకరిస్తున్న ఊట నీరు కలుషితమవుతోందని, అయినప్పటికీ ఆ నీరే తాగవలసిన దుస్థితి ఏర్పడిందని గ్రామ ప్రజలు వాపోయారు.అనేకమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ కనీసం పట్టించుకోలేదని మహిళలు వాపోయారు. ఐటీడీఏ గ్రీవెన్స్‌లో కూడా ఫిర్యాదు చేశామని, తమ సమస్య మాత్రం పరిష్కారం మార్గం కాలేదదన్నారు కలుషిత నీరు తాగడంతో విష జ్వరాలు, టైఫాయిడ్ వంటి రోగాల బారిన తిన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులు చేసుకుంటున్న ఈ సీజన్లో వరి నాట్ల పనులు మానుకొని మంచినీటి కోసం అవస్థలు పడవలసిన పరిస్థితి ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంక్ అలంకారప్రాయంగా మారిందన్నారు. ఏడు వీధులకు సంబంధించి కుళాయిలు నిరుపయోగంగా పడి ఉన్నాయని, తక్షణమే అధికారులు స్పందించి బర్రె మామిడి గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో తామంతా పాడేరు కదిలి వచ్చి ఐటిడిఏ ఎదుట మహిళలతో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంతల భీమ్ నాయుడు, బోనంగి మత్య కొండపడాల్, లోచలి పుష్పాలమ్మ, కించే కళావతి, వంతాల కాసులమ్మ, సిర్గం సావిత్రమ్మ, పూటి పోతురాజు పాల్గొన్నారు.










