ప్రజాశక్తి-డుంబ్రిగూడ:మండలంలోని గుంటసీమ పంచాయతీ చర్యవలస గ్రామంలో మరమ్మతు గురైన సోలార్ తాగునీటి పథకాన్ని మరమ్మత్తు చేసి వెంటనే తాగునీటి సౌకర్యం పునరుద్ధరించాలని కోరుతూ ఆ గ్రామస్తులు, గిరిమహిళలు ఖాళీ బిందెలతో గ్రావిటీ పథకం వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు. వెంటనే మరమ్మతులు చేసి తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి సూర్యనారాయణ మాట్లాడుతూ, ఆ గ్రామంలో తాగునీటి సౌకర్యం కోసం గత మూడు సంవత్సరాల క్రితం సోలార్ విద్యుత్ ద్వారా గ్రావిటీ పథకాన్ని రూ 15 లక్షలతో నిర్మించారన్నారు. ప్రస్తుతం మరమత్తు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం చేయడంతో ఆ గ్రామంలో తీవ్రమైన మంచినీటి ఎద్దడి ఏర్పడిందని చెప్పారు. సంబంధిత ఆర్‌బ్ల్యూఎస్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. తప్పని పరిస్థితుల్లో ఆ గ్రామానికి సమీపంలోని పొలంలోని బురద నీటిని సేకరించి ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల నాయకుడు పీ. తిలక్, కె.రామన్న నాయుడు, జి.డానియల్, పి.హరిశ్చంద్ర, కే.కర్రి బుడ్డి, పి.ప్రమీల, జి ముక్తా, కేలక్ష్మి, గ్రామ మహిళలు పాల్గొన్నారు.










