ప్రజాశక్తి - హోళగుంద
జిల్లాలోని పశ్చిమ ప్రాంతం నుంచి వలసలు ఆగడం లేదు. ఈఏడాది సరైన వర్షాల్లేక, పంటలు సరిగ్గా పండక రైతులు నష్టం మూటగట్టుకున్నారు. ఇక చేసేది లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. 'వలస వెళ్లకండి. పనులు కల్పిస్తాం' అని అధికారులు చెబుతున్నారు. 'ఉపాధి హామీ చట్టం కింద పని చేసినా సరైన సమయానికి వేతనాలు రావు. ఎలా బతకాల'ని కూలీలు పేర్కొటున్నారు.
వలసలతో రోజురోజుకూ గ్రామాలకు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. హోళగుంద నుంచి ఇప్పటికే దాదాపు 200 కుటుంబాలు బెంగళూరు, హైదరాబాద్, గుంటూరు, షాపూర్ తదితర పట్టణాలకు వలస వెళ్లాయి. రెండు రోజుల క్రితం కూడా హోళగుంద బీసీ కాలనీ నుంచి సుమారు 60 కుటుంబాలు వలస వెళ్లాయి. మండలంలోని గజ్జహళ్లి, వందవాగిలి, హెబ్బటం, నెరనికి, నెరనికి తండా గ్రామాల నుంచి గత 15 రోజుల క్రితమే వలస వెళ్లారు. ఈఏడాది పది ఎకరాల పొలం ఉన్న రైతు కుటుంబాలు కూడా వలసబాట పట్టాయి. ఇప్పటివరకు దాదాపు 500 కుటుంబాలు వలస వెళ్లినట్లు అంచనా. 'ఉపాధి పనులు కల్పిస్తాం. గ్రామాలు వదిలి వెళ్లకండి' అని అధికారులు చెబుతున్నారు. 'ఉపాధి పనుల వల్ల మాకు పెద్దగా లాభం లేదు. సరైన సమయానికి వేతనాలు రావు. ఇక్కడే ఉండి ఇబ్బంది పడడం కంటే పట్టణాలకు వెళ్లి పొట్ట నింపుకోవడమే మేల'ని వలస కూలీలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో చేతికొచ్చిన పంటలన్నీ అనావృష్టి వల్ల వర్షం లేక ఎండిపోయాయి. పంట పెట్టుబడి కోసం, ఫర్టిలైజర్ షాపుల్లో, ప్రయివేట్ వ్యక్తుల దగ్గర రైతులు అప్పులు చేశారు. అప్పుల సంగతి అలా ఉంచితే చేతినిండా పని లేకపోవడంతో పూట గడవడం కష్టంగా మారింది. గుంటూరు, బెంగళూరు వంటి సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. పట్టణాల్లో రోజుకు రూ.500 నుంచి 600 వరకు కూలి వస్తుందని, పొట్ట నింపుకోవడమే కాకుండా చిన్న, చిన్న అప్పులు కూడా తీర్చుకోవచ్చని వలస వెళ్తున్నట్లు కూలీలు చెబుతున్నారు.
సంపాదించడానికి కాదు.. పొట్ట నింపుకోవడానికే వలస...
సంపాదించడానికి కాదు. పొట్ట నింపుకోవడానికి వలస వెళ్తున్నామని కూలీలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో కొంతవరకు కూలి పనులున్నా కొందరికి మాత్రమే దొరుకుతోంది. 'ప్రతేడాది ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్నాం. ఈ ఏడాది వర్షాల్లేక పంటలు సరిగ్గా పండలేదు. మాకు ఎక్కడ పనులు దొరుకుతాయ'ని కూలీలు వాపోయారు.
సరైన సమయానికి వేతనాలు రావు
అధికారులు హడావిడి చేసి ఉపాధి పనులు కల్పించినా సరైన సమయానికి వేతనాలు రావని, ఉపాధి పనులను నమ్ముకుంటే తమ కుటుంబాల కడుపులు నిండవని కూలీలు పేర్కొంటున్నారు. ఉపాధి హామీ చట్టంపై తమకు భరోసా లేదని చెబుతున్నారు. పనులు కల్పించిన ఒక్కొక్కరికి రూ.200లకు మించి కూలి పడదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి ఆ కూలి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి చూస్తున్నామన్నారు. వలస వెళ్లిన దగ్గర ఒక్కొక్కరు రూ.500 నుంచి 600 వరకు సంపాదిస్తామని చెబుతున్నారు.
వర్షాలు కురవక వలస వచ్చాం
- నారాయణప్ప, గజ్జహల్లి గ్రామం
ఈఏడాది వర్షాల్లేక పంటలన్నీ ఎండిపోయాయి. కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు సిమెంట్ పనులు చేయడానికి వలస వెళ్లాం. అక్కడ ఉంటే రోజూ తిండి దొరకదు. చేసిన అప్పులు కూడా తీరవు. పిల్లాపాపలతో వలస వచ్చాం. ఇక్కడ ఆడవారికి రూ.400, మగవారికి రూ.600 కూలి ఇస్తున్నారు. ప్లాస్టిక్ కవర్‌తో చిన్నగా గుడిసెలు వేసుకుని జీవనం చేస్తున్నాం. తాగడానికి రూ.10 పెట్టి ఫిల్టర్ నీరు తెచ్చుకుంటాం. మమ్మల్ని కూలి పనికి పెట్టుకున్న వారి ఇళ్లలో నీరు తెచ్చుకుని వారానికోసారి స్నానం చేస్తాం. మా బాధను ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు.
పనులు కల్పిస్తాం
- ఎపిఒ భక్తవత్సలం
జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ చట్టం ద్వారా పనులు కల్పిస్తాం. ఎవరూ వలస వెళ్లకండి.