తిరువనంతపురం: ప్రధాన స్రవంతి మీడియా విస్మరిస్తున్న సమస్యలను దేశం దృష్టికి తెచ్చే ప్రత్యామ్నాయ మీడియాను అణచివేసేందుకు చేస్తున్న యత్నాలు అత్యంత అభ్యంతరకరమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ 'న్యూస్‌క్లిక్'పై ఢిల్లీ పోలీసులు జరిపిన దాడులు అటువంటి యత్నాల్లో భాగమేనని, వీటిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరముందని బుధవారం ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌లో ఆయన పేర్కొన్నారు. న్యూస్‌క్లిక్‌పై ఢిల్లీ పోలీసుల చర్యను పున్ణ పరిశీలించుకోవాలని విజయన్ కోరారు. అసమ్మతి వాణిని అణచివేయడం ఫాసిస్టు పద్ధతి అని ఆయన విమర్శించారు. మీడియా స్వేచ్ఛగా, నిజాయితీగా వార్తలను సేకరించి, ప్రచురించే స్వేచ్ఛను దేశం కల్పించింది. ఆ స్వేచ్ఛను కాపాడేలా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.










