Oct 16,2023 11:13

ప్రజాశక్తి-కేరళ : భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేరళలోని పాలక్కాడ్‌లో చేపట్టిన ఆందోళన 1000వ రోజుకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో కంజికోడ్ యూనిట్‌లోని ఉద్యోగులు తమ నిరసన వ్యూహాలను సమీక్షించనున్నారు. సైనిక వాహనాలు, మెట్రో కోచ్‌లు మరియు మైనింగ్ వాహనాల తయారీకి బీఈఎంఎల్ ప్రసిద్ధి చెందింది. బిజెపి కేంద్ర ప్రభుత్వం రూ. 56,000 కోట్ల విలువైన మినీ రత్న కంపెనీని రూ. 2,000 కోట్ల కంటే తక్కువ మొత్తానికి విక్రయించడానికి ప్రయత్నిస్తోందని కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 
 బీఈఎంఎల్ లో 54.03% ఉన్న ప్రభుత్వ ఈక్విటీ షేర్ క్యాపిటల్ లో 26% ఉపసంహరించుకుంటునట్లు బిజెపి కేంద్ర ప్రభుత్వం జనవరి 3, 2021న ప్రకటించింది. ప్రకటన వెలువడినప్పటి నుండి కంపెనీలోని నాలుగు యూనిట్లలోని కార్మికులు (కంజికోడ్ (కేరళ), కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కర్ణాటక), మైసూరు (కర్ణాటక) మరియు బెంగళూరు (కర్ణాటక) ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. దేశ రక్షణ మరియు దేశీయ రైలు రవాణా వ్యవస్థ మరియు మైనింగ్ పరిశ్రమతో సహా ఇతర కీలక రంగాలకు బీఈఎంఎల్ చాలా కీలకమైనదని వారు పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాలను కోసం చేస్తున్న తన నిరసన పట్ల కేంద్ర ప్రభుత్వం మోనంగా ఉంటుందని మండిపడుతున్నారు.