Nov 11,2020 07:34

          క్యూబాను లోపల నుంచి, బయట నుంచి దెబ్బ తీయడమే లక్ష్యంగా అమెరికా ఆ దేశంపై గత ఆరు దశాబ్దాలుగా రుద్దుతూ వస్తున్న ఆర్థిక దిగ్బంధనానికి జో బైడెన్‌ ముగింపు పలుకుతారా? లేక భ్రష్టు పట్టిన పాత విధానాన్నే కొనసాగిస్తారా? ఇతర దేశాల స్వాతంత్య్రాన్ని, సార్వభౌమత్వాన్ని గౌరవిస్తానని ఎన్నికల ప్రచార సందర్భంగా చెప్పిన బైడెన్‌ ఆచరణలో ఏవిధంగా వ్యవహరిస్తారో చూడాలి. పాలకులు మారినా అమెరికా విదేశాంగ విధానంలో పెద్దగా మార్పేమీ ఉండదని గత అనుభవం తెలియజేస్తున్నది. 1959లో విప్లవం ద్వారా క్యూబాలో రాజ్యాధికారాన్ని చేపట్టిన కాస్ట్రో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఐసెన్‌హోవర్‌ ప్రభుత్వం చివరి రోజుల్లో (1960) ఆర్థిక, వాణిజ్య దిగ్బంధనాన్ని ఒక పాచికగా ప్రయోగించింది. ఆ తరువాత వచ్చిన కెనడీ ప్రభుత్వం వాటిని మరిన్ని రంగాలకు విస్తరించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్యూబాకు డబ్బు, ఆహారం, మందులతో సహా అన్ని రకాల సరఫరాలను అడ్డుకుంటూ వస్తున్నది. 1980, 90 దశకాల్లో వీటికి మరిన్ని దుర్మార్గమైన ఆంక్షలను జోడించింది. 2014లో బరాక్‌ ఒబామా ప్రభుత్వం క్యూబాపై ఆంక్షలను కొంత మేర సడలించేందుకు ప్రయత్నించింది. ఆ ఏడాది డిసెంబరులో ఒబామా క్యూబాలో పర్యటించి రావుల్‌ కాస్ట్రోతో కుదుర్చుకున్న ఒప్పందం అర్ధ శతాబ్దం తరువాత ఇరు దేశాల మధ్య సాధారణ సంబంధాల పునరుద్ధరణపై ఆశలు చివురింపజేసింది. ఆ తరువాత అధ్యక్షుడిగా వచ్చిన ట్రంప్‌ ఆ ఒప్పందాన్ని కాలరాచి, క్యూబాపై మరిన్ని ఆంక్షలు విధించాడు. నవంబరు 3 అధ్యక్ష ఎన్నికలకు ఆరు వారాల ముందు క్యూబన్‌ ఆస్తులను నియంత్రిస్తూ మరి కొన్ని ఆంక్షలను విధించాడు. కరోనా మహమ్మారిపై పోరులో అన్ని దేశాలను కలుపుకుని పోవాల్సిన తరుణంలో ట్రంప్‌ తీసుకున్న ఈ చర్య ప్రపంచానికి అశనిపాతంలా పరిణమించింది. అమెరికా చర్యను రష్యా, చైనాతో సహా పలు లాటిన్‌ అమెరికా దేశాలు ఖండించాయి. క్యూబాపై ఆర్థిక, వాణిజ్య దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ వరుసగా 28వ సారి తీర్మానం చేసినా, అమెరికా దానిని లెక్కచేయలేదు. తనకు తొంబై మైళ్ల దూరంలో ఉన్న ఈ చిన్న దీవిని చూసి అమెరికా ఎందుకింతగా భయపడుతోంది? అక్కడ అమలులో ఉన్న సోషలిస్టు వ్యవస్థే దానిని ఇంతగా భయపెడుతోంది. ఇన్ని ఆంక్షల మధ్య కూడా క్యూబాలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం లోని ప్రభుత్వం తన దేశ ప్రజలందరి జీవన ప్రమాణాలను మెరుగుపరిచింది. కూడు, గూడు, గుడ్డ వంటి కనీస సదుపాయాలను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. క్యూబా ప్రజల సగటు ఆయు:ప్రమాణం 79 సంవత్సరాలకు పెంచింది. ప్రపంచ సగటు ఆయు:ప్రమాణం (73 సంవత్సరాలు) కన్నా ఇది ఎక్కువ. అలాగే శిశు మరణాల రేటులోనూ అది బ్రహ్మాండమైన పురోగతి సాధించింది. కరోనాపై పోరులో ముప్పయికి పైగా దేశాలకు తన వైద్య బృందాలను పంపింది. గత అరవై ఏళ్లలో 160 దేశాలకు నాలుగు లక్షల మంది వైద్య సహాయక సిబ్బందిని పంపిన దేశంగా క్యూబా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. సామ్రాజ్యవాద దేశమైన అమెరికా దీనికి భిన్నమైన పంథాను అనుసరిస్తున్నది. ప్రపంచానికి ఆయుధాలు ఎగుమతి చేయడం, ఫైనాన్స్‌ పెట్టుబడికి , నయా ఉదారవాద విధానాలనకు అడ్డు తగిలే ప్రభుత్వాలను కుట్రల ద్వారా కూలదోయడం, ప్రపంచ వనరులను కొల్లగొట్టడం ఇదీ దాని నైజం. ఇతర దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘనల గురించి గావు కేకలు పెట్టే అగ్రరాజ్యం తనకు మాత్రం అవేవీ వర్తించవన్నట్లు వ్యవహరిస్తున్నది. ఇది అగ్రరాజ్య తెంపరితనాన్ని తెలియజేస్తుంది. అమెరికా విధించిన ఆర్థిక, వాణిజ్య ఆంక్షల మూలంగా ఆహారం, మందుల కొరతతో అనేక మంది చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. కరోనాకు సంబంధించి చైనా పంపిన వెంటిలేటర్లు, మాస్కులను క్యూబాకు అందకుండా అడ్డుకోవడం ట్రంప్‌ క్రూరత్వానికి పరాకాష్ట. గడచిన ఒక్క సంవత్సరంలోనే ట్రంప్‌ క్యూబాపై కొత్తగా మరో 90 ఆంక్షలను విధించాడు. ఈ అరవై ఏళ్ల ఆర్థిక దిగ్బంధనం వల్ల క్యూబా ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం లక్ష కోట్ల డాలర్ల దాకా ఉన్నట్లు ఒక అంచనా. ఈ నష్టానికి పరిహారం ఎవరు చెల్లిసారు? ఫాసిస్టు ట్రంప్‌ను ఓడించి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న బైడెన్‌ మునుపటి ఒబామా ప్రభుత్వ విధానాలను పునరుద్ధరిస్తానని చెబుతున్నారు. క్యూబాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలంటే ఒబామా-రావుల్‌ కాస్ట్రో ఒప్పందాన్ని పునరుద్ధరించాలి. క్యూబాపై దిగ్బంధనాన్ని బేషరతుగా ఎత్తివేయాలి. పరస్పర గౌరవం, సమానత్వం ప్రాతిపదికన సంబంధాల పునరుద్ధరణకు తాను ఎప్పుడూ సిద్ధమేనని క్యూబా ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేసింది. దీనికి బైడెన్‌ వైఖరి ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.