
ప్రజాశక్తి - హెల్త్ యూనివర్సిటీ : క్యాంపస్ ప్లేసెమెంట్స్‌లో కెఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారని కెఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి.పార్థసారథి వర్మ తెలిపారు. అమెరికాకు చెందిన నూటానిక్స్ అనే అంతర్జాతీయ కంపెనీలో రూ.50.57 లక్షల వార్షిక వేతనంతో కూడిన ఉద్యోగాలకు ఏడుగురు విద్యార్థులు ఎంపికై మరోసారి రికార్డు సష్టించారని చెప్పారు. విజయవాడ మ్యూజియం రోడ్డులోని కెఎల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చివరి ఏడాది పూర్తి చేసుకుంటున్న విద్యార్దులు ప్రాంగణ ఎంపికలో భాగంగా అంతర్జాతీయ కంపెనీ అయిన నూటానిక్స్ కంపెనీలో మంచి వార్షిక వేతనంతో ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు రావడం హర్షణీయమన్నారు. తమ వర్సిటీలోని డీన్, డైరెక్టర్‌లు, విభాగాధిపతులు, అధ్యాపకులు విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దడంతో విద్యార్థులు ఈ విజయం సాదించారని వారిని పేర్కొన్నారు. విద్యార్థులు చదువు పూర్తి చేసుకోకముందే వారికి అత్యధిక వార్షిక ప్యాకేజీతో కూడిన ఉద్యోగాలు రావడం ఆనందంగా ఉందన్నారు. యూనివర్సిటీ ఉద్యోగాల కల్పన డీన్ డాక్టర్ ఎన్‌బివి ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులకు వందశాతం ఉద్యోగాలను అందించే లక్ష్యంతో తమ అధ్యాపకులు పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాసరావు మాట్లాడుతూ, స్నేహపూర్వకమైన వాతావరణంలో విద్యార్దులను ప్రపంచ స్థాయి నాయకులుగా తయారు చేయడం కెఎల్ యూనివర్సిటీ ప్రధాన లక్ష్యమన్నారు. అత్యధిక వేతనంతో ఉద్యోగాలు సాధించిన విద్యార్థినులు ఎం.సుజితలక్ష్మి, రంగు ఉషశ్రీ, ఎం.జాహ్నవి లక్ష్మి, వి.శ్రావ్య చందనలు పాల్గొని మాట్లాడుతూ, తమకు నాణ్యమైన విద్యతో పాటు ఉన్నతమైన ఉద్యోగాలను అందించి భవిష్యత్తుకు భరోసా అందించారని కెఎల్‌యు అధ్యాపకులకు వారి తల్లిదండ్రులతో కలిసి ధన్యవాదాలు తెలిపారు.