ప్రజాశక్తి - గుంటూరు జిల్లా : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని పెదకూరపాడు, సత్తెనపల్లి, తాడికొండ నియోజకవర్గాల్లో మూడ్రోజులపాటు నిర్వహించిన పర్యటన ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తొలిరోజు పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలో నిర్వహించిన పర్యటనకు మిశ్రమ స్పందన లభించింది. అమరావతి సభకు జనసమీకరణ ఆశించిన స్థాయిలో జరగలేదని భావించగా సత్తెనపల్లి, మేడికొండూరులో సభలకు జనం భారీగానే హాజరయ్యారు.
సభల్లో చంద్రబాబు రాష్ట్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సిఎం జగన్‌పై అనేక అవినీతి ఆరోపణలు చేశారు. పెదకూరపాడు, సత్తెనపల్లి ఎమ్మెల్యేలు నంబూరు శంకరరావు, అంబటి రాంబాబుపై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. వైసిపి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, వారు చేస్తున్న అవినీతి అక్రమాలపై నియోజకవర్గాల టిడిపి నాయకులు పట్టించుకోకపోవడం వల్ల వారి గురించి కూడా చంద్రబాబు నాయుడే మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా టిడిపి నాయకులంతా సిఎం జగన్, రాష్ట్ర మంత్రులపై విమర్శలు చేసి చేతులు దులుపుకొంటున్నారని నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్న అంశాలపై టిడిడి నాయకులు పట్టించుకోకపోవడం లేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లోని స్థానిక అంశాలపై చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించారు. వైసిపి నుంచి సస్పెండ్ అయిన ఉండవల్లి శ్రీదేవి గురించి మేడికొండూరు సభలో ప్రస్తావించకపోవడం గమనార్హం.
ఉమ్మడి జిల్లా నాయకుల మధ్య సమన్వయం లేదని పార్టీ ఇన్‌ఛార్జిలు, సీనియర్‌లను చంద్రబాబు తన సమీక్షలో మందలించారు. తనకు కన్నా లక్ష్మీనారాయణకు గతంలో ఎంతో రాజకీయ వైరం ఉండేదని, అయినా కన్నా ఒక మెట్టు దిగితే నేడు రెండు మెట్లు దిగి పార్టీలోకి తీసుకున్నానని జిల్లా నాయకులకు క్లాసు తీసుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో పనిచేయాలని, వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే చేసుకోండని ఘాటుగా మందలించారు. మాజీ ఎమ్మెల్యేలు కొంత మంది మూడేళ్లు ప్రజలకు దూరంగా ఉండి వ్యాపారాలు చేసుకోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. పార్టీకోసం పూర్తి సమయం పని చేసేవారికి అవకాశం ఇస్తానని జిల్లా నాయకులకు ఖరాఖండిగా చెప్పారు. సమన్వయం గురించి మాజీ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, యరపతినేని శ్రీనివాసరావు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా చంద్రబాబు పెదవి విరిచారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న సమస్యలపై ఎవ్వరూ సమన్వయంతో పనిచేయడం లేదని ఇక నుంచి ఈ సమన్వయ బాధ్యతలను మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు చూడాలని చెప్పారు.
సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ పేరు ఖరారు చేయకపోయినా పార్టీలో కొత్త వారు రావాలంటే పాత వారు సహకరించాలని పరోక్షంగా అందరికి చెప్పకనే చెప్పారు. పెదకూరపాడులో జనసమీకరణ లోపంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. సత్తెనపల్లి, మేడికొండూరు సభలకు ప్రజలు, టిడిపి క్యాడర్ బాగా వచ్చారని సంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు సమయపాలన పాటించకపోవడం, సభలు చాలా ఆలస్యంగా, రాత్రి 9 గంటల తర్వాత జరగడంతో కార్యకర్తల్లో కొంత అసంతృప్తి కన్పించింది.
(ఎ.వి.డి.శర్మ)










