Jan 03,2022 07:13

   ధునిక తెలుగు - వచన కవిత్వాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చిన కవుల్లో బాలగంగాధర తిలక్‌ ఒకరు. 'అమృతం కురిసిన రాత్రి' కవితాసంపుటితో సాహితీ ప్రపంచంలోకి అడుగుపెట్టి రసహృదయులైన పాఠకుల్ని అలరించి ఆకట్టుకున్నాడు. అనితర సాధ్యమైన శైలితో ఆబాలగోపాలాన్నీ కవితలతో ఉర్రూత లూగించి చెరగని ముద్ర వేశాడు. వ్యవహారిక భాషలోని పదాల మదుత్వంతో వాస్తవికతకు పెద్దపీట వేసి రసదృష్టితో మానవీయతకు పట్టంకట్టాడు. 'కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం చెయ్యాలి, విస్తరించాలి' అన్న తిలక్‌ కవితా పంక్తులు జడంగా పడివున్న సాహితీ లోకాన్ని ఒక్క కుదుపు కుదిపి ఉలిక్కి పడేలాగ చేశాయి. మానవ వికాస దశ ప్రస్థానంలో తన భావ, ప్రభావ ధారలతో నవ సమాజ ఆవిష్కరణ కోసం తిలక్‌ కొత్త ఒరవడిని సృష్టించాడు. ఈ కవితా సంపుటి గొప్ప ఖండికగా రూపుదిద్దుకోవడానికి తిలక్‌ ప్రదర్శించిన ప్రత్యేక నిర్మాణ శిల్ప రహస్యమే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
    తిలక్‌ మరణానంతరం వచన కవితా పితామహుడైన కుందుర్తి ఆంజనేయులు రాసిన పీఠికతో ఈ కవితాసంపుటి 1968లో వెలుగు చూసింది. 1971లో కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతిని పొందింది. సామాజికమైన ఆలోచనల్ని కవిత్వీకరించి, కవిత్వానికే వన్నె తెచ్చి సార్ధకతను కలిగించిన కవి తిలక్‌. అనుభూతిని అనుభవ నేపథ్యంగా వ్యక్తంచేసే రసవిద్య, శబ్దశక్తి, అలంకార పుష్టి, నైశిత్యం, సౌందర్యం వంటి లక్షణాలు తిలక్‌ని ఉన్నతశ్రేణి కవిగా నిలబెట్టాయి. ఇతని కవితల్ని చదవడం ప్రారంభిస్తే భావతీవ్రతతో పాటు మానసికావస్థను, ఆత్మవేదనను కలిగించి, రగిలించి రసాస్వాదనకు గురిచేస్తాయి. అందుకే తిలక్‌ 'భావకవుల్లో అభ్యుదయ కవి - అభ్యుదయ కవుల్లో భావకవి' అనిపించుకున్నాడు. 95 కవితలు కలిగిన ఈ పుస్తకం సకల భావాల సమాహారంతో బహుముఖ రూపాల కోణాల్ని ప్రదర్శిస్తుంది. ఓ చోట శ్రీశ్రీయే చెప్పినట్టు - 'కవితాసతి నొసటి నిత్య రస గంగాధరం' మన కవి బాలగంగాధర తిలక్‌.
'మేం మనుష్యులం/ మేం మహస్సులం
   గుండె లోపలి గుండె కదిలించి/ తీగ లోపలి తీగ సవరించి/ పాట పాటకి లేచు కెరటంలాగ/ మాట మాటకి మోగు కిన్నెరలాగ/ మేం ఆడుతాం/ మేం పాడుతాం' అని అంటాడు 'మేగ కార్టా' కవితలో కవి తిలక్‌.
    ఇది నిలువెత్తు సామూహిక చైతన్యరూపాలకి ప్రతీక. నిరంతర జీవ సంఘర్షణ రూపురేఖలకి సజీవ పతాక. నిరంకుశ అధికారానికి అడ్డుకట్ట వేసే ప్రజాస్వామిక వ్యక్తిగత స్వేచ్ఛా హక్కులపత్రం. మనసు లోపల అంతర్లీనమైన మనుషుల స్వభావాల్ని, తీవ్ర భావోద్వేగాల పరంపరలని ఇది బొమ్మ కట్టిస్తుంది. ఉత్తుంగ తరంగ జలపాతంలా ఎగిసిపడే విభిన్న ఆలోచనల రాపిడికి రాటుదేలిన ఆరాట పోరాటాల అంతర్ముఖ గుండెసవ్వళ్ళని ప్రతిబింబిస్తుంది. ఈ సామూహిక ప్రభంజన శక్తికీ, సృజనాత్మక కళాతృష్ణకీ మధ్య నలిగిన ఊగిసలాటే తిరుగుబాటు ధోరణిగా తిలక్‌ కవిత్వంలో చివరికి తొంగిచూసింది. ఇంకోచోట 'ఆర్ద్రతా - ఆవేశమూ' కలగలిపిన ఒక దయనీయమైన రసాత్మక సన్నివేశ మానసిక స్థితిని 'భూలోకం' కవితలో చాలా విషాదభరితంగా చిత్రిస్తాడు తిలక్‌.
'కూడులేని లోకం యిది/ గుండెలోతు తాపం యిది
సోమయాజి శాపం యిది/ భూమి అడుగు లోకం యిది' అని చెబుతూనే... ఈ కొనసాగింపుకి ముందు తళుక్కుమని మెరిసే కవితావాక్యాల్లో అసలు చేదు నిజాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తాడు కవి.
''అస్థి మూల పంజరాలు/ ఆర్తరావ మందిరాలు
ఏ లోకం తల్లీ/ ఏవో భాష్పాజలాలు' అంటూ 1941 నాటి బెంగాల్‌ స్థితిగతులను సజీవంగా కళ్ళకి కట్టిస్తాడు. అప్పటి యుద్ధ బీభత్స కరువు పరిస్థితుల్ని, అనావృష్టి - తుపాను సృష్టించిన క్షామాన్ని, ప్రబలమైన అంటువ్యాధులు మను షుల్ని మృత్యు ముఖంలోకి నెట్టేసిన వైనాన్ని, కవితాత్మక స్పర్శతో అక్షరీక రిస్తాడు తిలక్‌. ఇందులో వేదన కంటే సామాజిక దృష్టికోణమే బలంగా వ్యక్తమవుతుంది. సమస్యను సామూహిక కోణంలో కలవరించి పలవరించడం ఈ కవితకు ప్రధాన గీటురాయి. సరళత్వంలోని సహజశైలిని సామాజిక దర్పణంలో చూపించి కరుణ రసాత్మకంగా ఆవిష్కరించడంలో తిలక్‌ది అందె వేసిన చెయ్యి.
'వెళ్ళిపొండి వెళ్ళిపొండి' శీర్షికలో కవి అభివ్యక్తి పతాకస్థాయికి చేరుకుంటుంది. ధ్వని ప్రధానమైన వాక్య నిర్మాణాన్ని సరళ వ్యవహారిక శైలిలో వ్యక్తపరుస్తాడు.
'ఎవరు మీరంతా ఎందుకిలా వొంగిన నడుంతో కన్నీటితో
చెదిరిన జుట్టుతో జారిన పైటతో
ఈ సమాధుల చుట్టూ వెతుక్కుంటూ తిరుగుతారు
తల్లులా భార్యలా అక్కా చెల్లెండ్రా మీరు
ఏ యుద్ధంలో చనిపోయాడు మీవాడు
ఏ దళం ఎన్నవ నెంబరు
కురుక్షేత్రమయితే కృష్ణుణ్ణి అడుగు
పానిపట్టయితే పీష్వాల నడుగు
బొబ్బిలయితే బుస్సీ నడుగు
క్రిమియా యుద్ధం కొరియా యుద్ధం
ప్రథమ ద్వితీయ ప్రపంచ యుద్ధాలు
బిస్మార్క్‌ నడుగు హిట్లర్‌ నడుగు
బ్రహ్మ దేవుణ్ణి అడుగు' అని చారిత్రక స్ప ృహతో ప్రశ్నలు మీద ప్రశ్నలు సంధించడంలో స్త్రీజాతి మనోవేదనకి అక్షరరూపం ఇస్తాడు తిలక్‌. విషాదానికి ప్రతీకలుగా సమాధుల చుట్టూ సంచరించే స్త్రీమూర్తుల మనోభావాలను స్థూల దష్టితో అధ్యయనం చేసి విశాలతరం చేస్తాడు. ప్రాపంచిక నైజాన్ని యుద్ధ నేపథ్యంలో నిలదీసి తాత్వికతలోని తార్కిక స్వభావాన్ని విషాదకోణంలో పొందుపరుస్తాడు. ఈ వాక్యాల విరుపులో జాలితో కూడిన మెరుపులు అక్కడక్కడా ప్రతిధ్వనిస్తాయి. అంతర్లయతో కూడిన నడక కవిత్వానికి శిల్పంతో ప్రాణప్రతిష్ట చేస్తుంది.
తిలక్‌ సాధారణ వాక్యాల్ని వాచ్యం చెయ్యకుండా కవిత్వంగా మలచడంలో మంచి దిట్ట. దీనికి తార్కాణంగా 'తపాలా బంట్రోతు' కవితను ఉదాహరించవచ్చు.
'ఆ కిటికీలో రెండు విచ్చిన కలువల్లాంటి కళ్ళు
ఆ వీధి మొగవైపే ప్రసరిస్తోన్న చూపుల ముళ్ళు
ఆ కళ్ళలో ఆత్రుత/ ఆ గుండెల్లో గడచిన
దేశాంతర గతుడైన ప్రియుడి వార్త కోసం' అన్న పలుకుల్లో మెరిసే దిగులుకళ్ళకి ఆశే ఒక ఊరటగా కనిపిస్తుంది. చెవిలో పెన్సిల్‌, చేతిలో సంచి, ఖాకీ దుస్తుల్లో చాలా సాదాసీదాగా అగుపించే ఆ పాత కాలపు నాటి పోస్టుమ్యాన్‌ ముఖచిత్రం కళ్ళ ముందు అపురూపంగా మెదులుతుంది. ఆ చిన్నసైజు జీతగాడి రాక కోసం ఎన్నెన్ని ఎదురుచూపులు కాలానికి కాపలా కాస్తాయి. ఊహించని జీవన మలుపుల్లో ఊరించే విషాదోత్సాహాలుగా ఎలా వెల్లివిరుస్తాయి. అలాంటి దినసరి సన్నివేశాల్ని కవితాత్మక దృశ్యాలుగా చిత్రీకరించడంలో గొప్ప నేర్పును ప్రదర్శిస్తాడు తిలక్‌.
ఇలాంటిదే మరో సందర్భాన్ని ఇదే కవితలో సోదాహరణంగా విడమర్చి చెప్పి కరుణ రసాత్మకంగా విశ్లేషిస్తాడు కవి.
'ఇన్ని యిళ్ళు తిరిగినా/ నీ గుండెబరువు దింపుకోవడానికి
ఒక్క గడపలేదు/ ఇన్ని కళ్ళు పిలిచినా
ఒక్క నయనం నీ కోటుదాటి లోపలకు చూడదు
ఉత్తరం యిచ్చి నిర్లిప్తుడిలాగ వెళ్ళిపోయే
నిన్ను చూసినప్పుడు
తీరం వదిలి సముద్రంలోకి పోతూన్న ఏకాకి నౌక చప్పుడు' అనడంలోని ఔచిత్యాన్ని గమనిస్తే కవి మనసులోని గుండెలోతు తడిభావాలను ఆనవాళ్ళుగా పసిగట్టవచ్చు.
అందుకే తిలక్‌ ఓ కవితలో ఇలా అంటాడు : 'అంత్యప్రాసలు వేసినంత మాత్రాన ప్రొసైక్‌ భావం పోయెట్రీ అవదు' అని. ఇది ముమ్మాటికీ అక్షరసత్యం .కవిత్వ నిర్మాణ రహస్యం తెలిసినవాళ్ళకి దీని ఆంతర్యం అంతర్ముఖంగా బోధపడుతుంది.
'నువ్వు చెప్పేదేదైనా నీదై వుండాలి. నీలోంచి రావాలి. చించుకుని రావాలి' అంటూ సొంత గొంతుకోసం, స్వీయముద్ర కోసం, అశు కవిత్వం కోసం ఆరాటపడతాడు తిలక్‌.
తిలక్‌ కవితా తత్వాన్ని తెలుసుకోవడానికి అతని అంతరంగాన్ని తడిమిచూడాలి. ఒకచోట తానే చెప్పినట్టు 'నా కవిత్వంలో నేను దొరుకుతాను' అన్న కవితాపంక్తుల్ని దృష్టిలో పెట్టుకుని అధ్యయనం చెయ్యాలి. కావ్యానుభూతి తారాస్థాయికి చేరినప్పుడు తిలక్‌లోని సౌందర్యానుభూతి కట్టలు తెంచుకుని ప్రవహిస్తుంది. అనుభూతి అంటే 'ప్రత్యక్షజ్ఞానం' అని అర్థం. దీనిని సహజాతంగా విమర్శకులు విశ్లేషిస్తారు. ఇందులో సుఖదు:ఖాల మేళవింపు పలు రకాలుగా దర్శనమిస్తుంది.
'నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు' అంటూ ప్రగాఢమైన అనుభూతితో నిర్వచిస్తాడు తిలక్‌.
సామాజికానుభూతుల్ని సంపూర్ణంగా దర్శించి చేతనత్వాన్ని ప్రతిబింబించినపుడు కలిగే భావాలు సామాజికమైపోతాయి. అంతస్సీమల్లోకి మమేకమై పరవశించిపోయినపుడు అవి స్వాప్నికానుభూతులుగా మారిపోతాయి. అలా రూపుదిద్దుకున్నవే ఈ కవితాక్షర గుళికలు. సందర్భాన్ని బట్టి కవిలోని మానసిక, గ్రహణ స్థితులు రూపాంతరం చెంది స్వీయానుభూతులుగా ఊపిరి పోసుకుంటాయి. దీనిని విలియం వర్డ్స్‌ వర్త్‌ మాటల్లో చెప్పాలంటే 'కవిత్వం ఎల్లప్పుడూ పొంగి పొరలి వచ్చే శక్తివంతాలైన అనుభూతులతో నిండి ఉంటుంది (ూశీవ్‌తీy ఱర ్‌ష్ట్రవ రజూశీఅ్‌aఅవశీబర శీఙవతీటశ్రీశీష శీట జూశీషవతీటబశ్రీ టవవశ్రీఱఅస్త్రర - ఔఱశ్రీశ్రీఱaఎ ఔశీతీసరషశీత్‌ీష్ట్ర) పలుకుల్ని ఈ తరుణంలో స్ఫురణకు తెచ్చుకోకుండా ఉండలేం. కవిత్వంలో దాగిన నిగూఢత అనుభూతిగా మారి దాని ఆకార స్థితి పారదర్శకమై పాఠకుడి స్థాయికి అందాలి. అప్పుడే దానిని ఆస్వాదించి ఆనందించ గలుగుతాం. తిలక్‌లో ఈ లక్షణం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
కవిత్వాన్ని వ్యంగ్యరూపంలో ధ్వనింపచేసి హాస్యాన్ని చతురతతో పండించడంలో కవి తిలక్‌ ప్రతిభ అనితర సాధ్యమైనది. వాక్యాల్ని సాదాసీదాగా చెబుతూనే సాధారణ విషయాల్ని అసాధారణ కవిత్వంగా మలచడంలో తిలక్‌ దృష్టికోణమే వేరు. 'న్యూ సిలబస్‌' కవితలో ఈ విషయం స్పష్టమవుతుంది.
'అమెరికాలో డాలర్లు పండును/
ఇండియాలో సంతానం పండును
భూమి తనచుట్టూ తాను తిరుగుతూ/ ధనవంతుడి చుట్టూ తిరుగుతోంది' అంటూ ఓ వ్యంగ్యాస్త్రాన్ని సంధిస్తాడు తిలక్‌. ఇందులో అధిక సంతానోత్పత్తి తీవ్రతని, ధన వ్యామోహ నైజాన్ని చమత్కార రీతిలో ఆవిష్కరిస్తాడు. వ్యంగ్యస్పృహతో, వాస్తవిక ధోరణిలో ఆలోచింపజేస్తాడు. తిలక్‌ కవితల్లో కవితాత్మక వాక్యాలు అనేకం దర్శనమిస్తాయి. వాక్యాల్లో వచనానికి బదులు అలరించే కవిత్వ గుళికలు తళుక్కున మెరిస్తే, ఆ కవిత సారవంతమైనట్టే.
'మంచి గంధంలాగ పరిమళించే మానవత్వం,
మాకున్న ఒకే ఒక అలంకారం'
'గజానికొక గాంధారి కొడుకు గాంధీగారి దేశంలో '
'చలి గుండెల మీద కత్తిలా తెగింది'
'మాలిన్యం మనసులో వున్నా మల్లె పువ్వులా నవ్వగల్గడం యీనాటి తెలివి'
'నాగరికత మైలపడిన దుప్పటిలా నన్ను కప్పుకుంది'
'శ్మశాన భూమిని వికసిస్తుంది మీరు నాటిన పూలచెట్టు'
'చీకటి మార్జాలపు పచ్చని కళ్ళు'
'దీపపు వత్తి చివర నిద్రపోయే నిప్పునలుసు'
'తెల్లని దలసరి మంచు రాత్రి చీకటికి అంచు'
'గుండె కింద నెత్తురు నడచెను'
'కీ యిస్తే తిరిగే అట్టముక్క సైనికులం'
'ప్రాణంగల పాడే వేణువులు ఈ యిసుక రేణువులు'
'సంజె వెన్నెల బాల రంగు పరికిణి చెంగు'
'కొబ్బరి మొవ్వ పిచ్చుక గొంతులో మెరిసి'
'ఆకాశం తెల్లని శ్మశానమై చెదరెను'
'నువ్వు నడిచే దారిలో ఆకాశం మోకరిల్లి నక్షత్రాల్ని జల్లుతుంది'
'చిటారుకొమ్మలో నక్షత్రం చిక్కుకుంది'
'ఆనందం మనిషైనవాడు'
'రాత్రి గుండెల మీద లేచిన మంటలు'
'ఎర్రని పెదవుల మీద తెల్లని నవ్వుల వీణల్ని మీటుతున్నాడు'
'స్వార్థం పిచ్చికుక్కలా పరుగెత్తింది'
'చిక్కబడుతున్న సంజె చీకట్ల చాలులో'
'పలుకలేని గులకరాళ్ళు'
'నగరం టవరు మీద ఎక్కి ఎర్రగా చూస్తోంది'
'చెదిరి విరిగిన సముద్రపు కెరటాన్ని నేను'
'దరిద్రం సముద్రంలో వేదనల తెరచాపలెత్తి'
'ఈ వెన్నెల నా మనస్సులోకి జారుతోంది'
'బ్రతుకు అంచుమీద నల్లని దు:ఖపు కెరటం విరుచుకుపడింది'
'చీకటి కుంపటిలో అస్పష్ట భవిష్యత్తు రాజుకుంటున్నది'
'మాకు లోకం ఒక గీటురాయి'
'నేను నిర్మించుకున్న ఆశాచంద్రశాలలో, కాలం కరిగి వెన్నెలయింది'
... ఇలాంటి కవితాపంక్తుల్లో జీవం ఉట్టిపడే జీవితఛాయలు అడుగడుగునా అక్షరాల్లో పరిమళించి కవిత్వాన్ని శోభాయమానం చేస్తాయి.
తిలక్‌ కవితల్లో సార్వకాలీనత, విశ్వజనీనత, పరమార్థిక దృష్టి గోచరిస్తాయి. సామాజిక కర్తవ్య ప్రభోదాలు, రసార్ద్రత ఉట్టిపడే మానవీయ కోణాలు, ఎడతెగని సౌందర్యకాంక్షలు ఈ కవిని ఓచోట స్థిరంగా ఉండనీయలేదు. అంతర్లీన శక్తులను వెలికితీసి, కవితానుభవాలుగా పరిచి, చైతన్య వీచికలుగా ఎగరేశాయి. ఇతని కవిత్వమంతా అలా రూపుదిద్దుకున్నదే. కాబట్టే అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ చెరగని ముద్ర తిలక్‌.
ఓ చోట తిలక్‌ చెప్పినట్లు -
'చైతన్యం పరిధి
అగ్ని జల్లినా, అమృతం కురిసినా
అందం, ఆనందం దాని పరమావధి'
 

(ఇది తిలక్‌ శతజయంతి సంవత్సరం)
మానాపురం రాజా చంద్రశేఖర్‌
77940 39813