Aug 06,2023 00:21

వర్కింగ్‌ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న రామస్వామి

ప్రజాశక్తి-ఉక్కునగరం : క్విట్‌ ఇండియా స్ఫూర్తితో ఈ నెల 9వ తేదీన ''క్విట్‌ మోడీ-సేవ్‌ వైజాగ్‌ స్టీల్‌'' నినాదంతో జరుగుతున్న నిరసన దీక్షను జయప్రదం చేయాలని స్టీల్‌ సిఐటియు గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్‌ పిలుపునిచ్చారు. ఉక్కునగరంలోని సిఐటియు కార్యాలయంలో స్టీల్‌ సిఐటియు వర్కింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయోధ్యరామ్‌ మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను, ప్రభుత్వ రంగ పరిశ్రమల భవిష్యత్తును నిర్వీర్యం చేస్తోందని, దీనికి వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు ''క్విట్‌ మోడీ- సేవ్‌ ఇండియా''అన్న నినాదాన్ని ఇచ్చాయని తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన పెద్ద ఎత్తున కార్మిక లోకాన్ని కదిలించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
విశాఖ ఉక్కు కర్మాగారానికి తీవ్రంగా ముడి సరుకుల కొరతను సృష్టించి పరిశ్రమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే విధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పనికి వత్తాసుగా గంగవరం పోర్ట్‌ యాజమాన్యం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ సమయంలో కార్మికుల మధ్య ఐక్యతను పెంపొందించే విధంగా సిఐటియు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
స్టీల్‌ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి మాట్లాడుతూ, విశాఖ స్టీల్‌ కార్మికులకు నూతన వేతనాలు అమలు చేయడంలో యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించారు. కార్మిక ప్రయోజనాలను ఆశించి, కార్మిక సంఘాలు తమ విద్వేషాలను పక్కనపెట్టి ప్రభుత్వం, యాజమాన్యాలపై పోరాటానికి సన్నద్ధం చేయాలని పిలుపునిచ్చారు. స్టీల్‌ సిఐటియు అధ్యక్షులు వైటి.దాస్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్టీల్‌ సిఐటియు నాయకులు బి.అప్పారావు, యు.వెంకటేశ్వర్లు, పుల్లారావు, మొహిద్దిన్‌, ఎ.శ్రీనివాసరావు, రమణమూర్తి, ఆర్‌.రాజేశ్వరరావు, డిఎస్‌.శ్రీనివాస్‌, రామన్న, విడివి పూర్ణచంద్రరావు, డి.సత్యనారాయణ, కె.బాలశౌరి, సిహెచ్‌.వెంకట్రావు, వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, వర్కింగ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.