* బిజెపిని గద్దె దించి దేశాన్ని కాపాడాలి
* క్విట్ ఇండియా స్ఫూర్తితో ఉద్యమం
* రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు
* కలెక్టరేట్ వద్ద ధర్నా
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్, టెక్కలి రూరల్, పలాస: క్విట్ ఇండియా స్ఫూర్తితో కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించి దేశాన్ని కాపాడాలని కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు నాయకులు పిలుపునిచ్చారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యాన 'క్విట్ మోడీ-సేవ్ ఇండియా' పేరిట కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొమ్మిదేళ్ల మోడీ పాలనలో కార్మిక, రైతు సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదని, కనీస వేతనం రూ. 26 వేలకు పెంచాలన్న డిమాండ్‌ను పెడచెవిన పెట్టారని విమర్శించారు. కాంట్రాక్టు కార్మికులు, స్కీమ్‌వర్కర్ల శ్రమను దోచుకోవడం తప్ప వారిని రెగ్యులర్ చేయలేదన్నారు. రక్షణ, రైల్వే, బ్యాంకులు, ఎల్‌ఐసి వంటి కీలక రంగాలతో సహా ప్రతి ప్రభుత్వరంగ సంస్థను ప్రైవేటీకరిస్తామని మోడీ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. 900 రోజులుగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరాడుతున్నా, ప్రైవేటీకరణకు దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలన్నీ మూతపడితే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారని, పర్మినెంట్ ఉద్యోగాలనేవి లేకుండా కార్మికులు బానిసలవుతారని తెలిపారు. ఇపిఎస్ పెన్షన్‌ను రూ.ఏడు వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం నిర్వహించాల్సిన త్రైపాక్షిక భారత కార్మిక మహాసభను బిజెపి ప్రభుత్వం 2015 నుంచి నిర్వహించడం లేదని, ఈ మహాసభలు జరిగితే కార్మిక సమస్యలు చర్చకు వస్తాయని చెప్పారు. సంపద మొత్తం అదానీ, అంబానీ వంటి వారి చేతుల్లో పోగుపడి ఆర్థిక సంక్షోభాలకు దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగ పోరాటానికి తలొగ్గి నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేసినా, రైతులకు మోడీ ఇచ్చిన వాగ్దానాలు ఇంతవరకు నెరవేర్చలేదని విమర్శించారు. వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర గ్యారంటీ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీకి బడ్జెట్‌లో నిధులు తగ్గించి చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. కార్మికులు, ప్రజల అసంతృప్తిని పక్కదారి పట్టించడానికి మోడీ ప్రభుత్వం మతాల వారీగా ప్రజలను నిట్టనిలువునా చీలుస్తోందన్నారు. వ్యవసాయం కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి పోయి ఆహార సంక్షోభాలు వస్తాయని, మిగిలి ఉన్న సబ్సిడీలు పోతాయని, అందుకనే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపి దేశాన్ని కాపాడాలని కోరారు. బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించాల్సింది పోయి రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన మద్దతు ఇస్తున్నాయన్నారు. ధర్నా అనంతరం కలెక్టరేట్ ఎఒ రాజేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ తాండ్ర ప్రకాష్, రైతు సంఘం నాయకులు బలగ శ్రీరామ్మూర్తి, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ కె.నాగమణి, ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి డి.గణేష్, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి చిక్కాల గోవిందరావు, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డి.పార్వతీశం తదితరులు పాల్గొన్నారు.
నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద...
శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మహాత్మాగాంధీ విగ్రహం వద్ద క్విట్ వివక్ష, క్విట్ మతోన్మాదం పేరుతో కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గంగరాపు ఈశ్వరమ్మ, కెవిపిఎస్ నాయకులు కె.నరసింహులు, సిపిఎం నాయకులు టి.తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
టెక్కలి రూరల్ : తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎన్.షణ్ముఖరావు, హెచ్.ఈశ్వరరావు, రైతుసంఘం నాయకులు బగాది వాసు, బగాది కృష్ణ, ఎం.గోపాల్, ఎఐటియుసి నాయకులు యడ్ల గోపి, రాజారావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జి.సుబ్రమణ్యం పాల్గొన్నారు.
పలాస : కాశీబుగ్గ పాతబస్టాండ్ వద్ద గల గాంధీ విగ్రహం వద్ద కార్మిక, రైతాంగ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆర్‌డిఒ టి.సీతారామ్మూర్తికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్.గణపతి, లిబరేషన్ సీనియర్ నాయకులు ఎం.మల్లేశ్వరరావు, ఎఐటియుసి నాయకులు సిహెచ్.వేణుగోపాల్, జీడి రైతుల సంఘం నాయకులు తెప్పల అజరు కుమార్, రైతుసంఘం నాయకులు టి.భాస్కరరావు, కె.బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు.










