Aug 10,2022 00:25

మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నరసింగరావు

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో, ఎంవిపి.కాలనీ
క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాటం సాగిస్తామని ప్రభుత్వ రంగ పరిశ్రమలకు చెందిన పలు ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు, ప్రతినిధులు ఉద్ఘాటించారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉనికిని కాపాడుకుంటేనే ఉద్యోగులకు రక్షణ, భవిష్యత్తు ఉపాధికి భరోసా ఉంటుందని అన్నారు. మంగళవారం ఉదయం నగరంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన 'కార్మిక సదస్సు' జరిగింది. క్విట్‌ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో పోరాడి స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటామని పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యారాం సదస్సులో చేసిన తీర్మానానికి హాజరైన కార్మిక సంఘాల నేతలంతా హర్షామోదాలను తెలిపారు. సదస్సుకు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్‌ డి.ఆదినారాయణ అధ్యక్షత వహించారు. విశాఖలోని పరిశ్రమల్లో గుర్తింపు సంఘం నాయకులు మాట్లాడుతూ మిగతా యూనియన్లను ఐక్యం చేసి సెప్టెంబర్‌లో జరిగే స్టీల్‌ప్లాంట్‌ రక్షణ ఆందోళనా కార్యక్రమాల్లో ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తామని ప్రకటించారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్‌ సిహెచ్‌.నరసింగరావు మాట్లాడుతూ విశాఖ పోర్టులో మానిటైజేషన్‌ పైపులైన్‌ స్కీం పేర మూడు బెర్తులనే పిపిపికి ఇవ్వాల్సి ఉండగా మరో రెండు కలిపి మొత్తం ఐదు ఇచ్చేయడం దారుణమన్నారు. 20 కోట్ల మంది నిత్యం ప్రయాణాలు చేసే రైల్వే రంగంపైనా ప్రైవేటీకరణ కత్తి వేలాడుతుందన్నారు. రైల్వే జోన్‌కు సంబంధించి డిపిఆర్‌ను ఆమోదించామని రైల్వే మంత్రి తాజాగా చెబుతున్నారని, దీనికి ఎనిమిదేళ్లు పట్టిందా ? అని ప్రశ్నించారు. పోరాట కమిటీ ఛైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ భారతదేశంలోనే వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ గర్వకారణంగా నిలిచేలా కేంద్రానికి రూ.50 వేల కోట్ల వరకూ డివిడెండ్లు, ఇతర పన్నుల రూపేణా చెల్లించిందని, ప్రభుత్వ రంగంలో ఉన్నందునే ఇది సాధ్యపడిందని అన్నారు. త్వరలో ఎంపీలంతా కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను రక్షించుకునే క్రమంలో పోరాటం ఒక్కటే పరిష్కారమని ఎపి ఎన్‌జిఒ సంఘం నాయకులు ఈశ్వరరావు అన్నారు. హెచ్‌పి సిఎల్‌ గుర్తింపు సంఘం నాయకులు నాయుడు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునే పని చేయకపోతే మొన్న జింక్‌ను వదులుకున్నట్లే అవుతుందని అన్నారు. స్టీల్‌ప్లాంట్‌తో కేంద్రం ఆగదని తర్వాత బిహెచ్‌పివి, బిఎస్‌ఎన్‌ఎల్‌... ఇలా అన్నింటినీ ప్రయివేటుకు కట్టబెడుతుందని బిహెచ్‌పివి నాయకులు బాబూరావు అన్నారు. విశాఖ ఇంతగా వెలుగులోకి వచ్చిందంటే పోర్టే కారణమని, విదేశీ మారకద్రవ్యం దీనివల్ల వస్తుందని అలాంటి పోర్టు ప్రయివేటీకరణ దిశగా వెళ్లిపోతోందని పోర్టు యూనియన్‌ నాయకులు మసేన్‌ తెలిపారు. ఒకప్పుడు షిప్‌యార్డులో అనైక్యత ఉండేదని, స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమం హిందుస్థాన్‌ షిప్‌యార్డులోని అన్ని కార్మిక సంఘాలనూ ఒకే తాటిపైకి తీసుకురావడం గొప్ప మార్పుగా తాము భావిస్తున్నామని యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ రమణమూర్తి అన్నారు. కేంద్రం ఎంత మొండిగా ఉన్నా మెడలు వంచి పోరాటం విజయం సాధించాలని, అప్పుడే షిప్‌యార్డు వంటి ప్రభుత్వ సంస్థలకు రక్షణని అన్నారు. దేశంలో అప్పులు ఎగ్గొట్టడానికి ఎన్‌పిఎ అని ముద్దుపేరు బడాబాబులకు పెట్టారని, స్టీల్‌ప్లాంట్‌ లోన్‌ కేవలం రూ.25 వేల కోట్లు ఉంటే అమ్మేస్తాం, మూసేస్తాం అనడం దారుణమని డాక్‌యార్డు గుర్తింపు సంఘం నాయకులు నాగేశ్వరరావు అన్నారు. ఈ సదస్సులో విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాల జెఎసి కన్వీనర్‌ ఎం.జగ్గునాయుడు, నాయకులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.