ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : కుల వివక్ష, అంటరానితనం, మతోన్మాదాలకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో పోరాటానికి సన్నద్ధం కావాలని దళిత, గిరిజన, ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని గడియారం స్తంభం సెంటర్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత, గిరిజన, ప్రజా సంఘాలు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు. తొలుత కుల ఉన్మాదం దిష్టి బొమ్మను దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా నేటికీ దళితుల మీద కులవివక్షత, అంటరానితనం, దాడులు, హత్యలు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వెలిబుచ్చారు. కేంద్రంలో మనువాద ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వంలోని బిజెపి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు, మతోన్మాద చర్యలు తీవ్రంగా పెరిగాయని విమర్శించారు. వీటిని ప్రజలంతా ఐక్యంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని, అందుఉ ప్రజాస్వామిక వాదులు, మేధావులు సన్నద్ధం కావాలని కోరారు. కార్యక్రమంలో కెవిపిఎస్ పల్నాడు జిల్లా కార్యదర్శి జి.రవిబాబు, నాయకులు ఎం.విల్సన్, ఎం.ఆంజనేయులు, ఎం.సా గర్, జె.రాజ్‌కుమార్, మాల మహానాడు జిల్లా నాయకులు జి.జాన్‌పాల్, సిఐటియు నాయకులు పి.వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి టి.పెద్దిరాజు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-ముప్పాళ్ల : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ నిరంకుశ, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్వింట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మండల కేంద్రమైన ముప్పాళ్లలో సేవ్ ఇండియా - సేవ్ అగ్రికల్చర్ కార్యక్రమాన్ని చేపట్టారు. అఖిలభారత రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు జి.బాలకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల నుండి పన్నుల రూపంలో దోచుకోని కార్పొరేట్లకు దోచిపెడుతోందని, మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతోందని విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను లేబర్ కోడ్లుగా మార్పు చేసి హక్కులను హరిస్తోందన్నారు. పంటలకు మద్దతు ధరల చట్టం తేవాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు టి.అమరలింగేశ్వరరావు, జి.జాలయ్య, ఐ.వెంకటరెడ్డి, పి.సైదాఖాన్, నరసింహారావు, టి.వెంకటేశ్వర్లు, జి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.










