Jul 23,2023 00:24

శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి -ములగాడ : జివిఎంసి 61వ వార్డు పరిధి గొల్లవీధిలో ప్రజా కవి, అభ్యుదయ గేయ రచయిత నూనెల శ్రీనివాసరావు మూడవ వర్థంతిని సిపిఎం ఆధ్వర్యాన ఘనంగా నిర్వహించారు. శ్రీనివాసరావు చిత్రపటానికి సిపిఎం మల్కాపురం జోన్‌ నాయకులు ఉరికూటి బాబూరావు, ఐద్వా జోన్‌ కార్యదర్శి ఆర్‌.విమల పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన వర్థంతి సభలో బాబూరావు మాట్లాడుతూ, పోర్టులో ఉద్యోగం చేస్తూ సిఐటియులో చేరి కార్మిక సమస్యలపై అనేక పొరాటాలు చేశారని తెలిపారు. మల్కాపురంలో డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాల అభివృద్ధికి కృషిచేశారన్నారు. సిపిఎంలో చేరి మల్కాపురం ప్రాంత సమస్యలపై పనిచేశారని తెలిపారు. మల్కాపురంలో అన్ని కుల సంఘాలను ఒక్కటిచేసి కేబుల్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుచేసి అతి తక్కవ ధరకు కనక్షన్‌ వేసి ప్రజల మన్నలను పొందారన్నారు. ప్రజలు, కార్మికులు సమస్యలపై అనేక పాటలు రాసి చైతన్యపరిచారని తెలిపారు. ప్రభుత్వాల విధానాలు, ప్రజలపై భారాలను ఎండగడుతూ పాటలను రాసి ప్రజానాట్యమండలి ఆధ్వర్యాన మల్కాపురం ప్రాంతంలోని వీధివీధినా ప్రదర్శలు ఇచ్చారని గుర్తుచేశారు. అటువంటి నేతలను కరోనా మహామ్మరి పొట్టనపెట్టుకుందని విచారం వ్యక్తంచేశారు. ఈ ప్రాంతానికి ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాపురం శాఖ కార్యదర్శి ఎన్‌.ఉమ, శ్రీనివాసరావు కుంటుంబ సభ్యులు లలిత, ఆదిలక్ష్మి, చంటి, లావణ్య, భారతి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.