Apr 11,2021 11:43

ఉగాది దగ్గరకు వచ్చేసింది! స్వాగత సన్నాహాలు మొదలయ్యాయి. మామిడిచెట్లు గుత్తులుగుత్తులుగా కాయలను వేలాడదీశాయి. వేపచెట్లు పాలపుంత సముదాయాల్లా తెల్లని పూతతో నిగనిగలాడుతున్నాయి. చింతచెట్లు పుల్లని కంకణాలతో నోరూరిస్తున్నాయి. మామిడి చివుళ్లు మేసిన కోయిళ్లు బృందగానాన్ని మొదలుపెట్టాయి! ఒకటికి ఒకటి తోడై పల్లవిస్తేనే కదా పర్వదినం! స్పందనా ప్రతిస్పందనల సమ్మేళనమే కదా సంతోషాల ప్రవాహం! ప్రకృతి ఇంతగా పరవశిస్తున్నా.. ఎందుకనో వాతావరణంలో ఉత్సాహ సందడి లేదు. ఉత్తేజపు ఉరవడి కనపడడం లేదు. ఎందుకంటే- ఆ సోయగాన్ని స్వీకరించే మనిషి సంతోషంగా లేడు. ఆ సందడిని సమన్వయం చేసి, ఆ సంతోషాన్ని వెయ్యింతలు చేసే మనిషి ఆనందంగా లేడు. చెట్లు ఆ సంగతిని గమనించాయి. కోయిళ్లూ గ్రహించి, కూయడం ఆపేశాయి. వాటిలో అవే చర్చించుకోవటం మొదలెట్టాయి.

delhi

   సలు మనిషికి ఏమైంది? ప్రకృతి పరవశిస్తున్నా- ఎందుకని ప్రతిస్పందించటం లేదు? సాగు చేసే రైతు ఎందుకు చింతాక్రాంతుడై ఉన్నాడు? కాయకష్టపు కార్మికులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? యువతీ యువకుల్లో ఆ ఉత్సాహపు పరవళ్లేవి? బయటికి వెళుతున్న ఆ అమ్మాయి కళ్లల్లో ఆ బెరుకు బెరుకు మినుకుళ్లెందుకు? పరీక్షలు దగ్గర పడుతున్న ఈ తరుణాన... విద్యార్థుల గుండెల్లో గుబులెందుకు?... ఇలా చాలా చాలా తర్కించాయి చెట్లూ చేమలూ. చాలా చాలా ఆలోచించాయి కోయిళ్లూ నెమళ్లూ. కారణం ఏమిటో తెలియటానికి ఎంతోసేపు పట్టలేదు వాటికి. ఢిల్లీ పాలకుల ఏలుబడే ఈ సమస్త ఆవేదనకూ, ఆందోళనకూ మూల కారణమని గ్రహించాయి. తాము సైతం ఏదొకటి చేయాలని అనుకున్నాయి. దేశమంతటా ఎవరెవరు ఏఏ ఇబ్బందుల్లో ఉన్నారో తెలుసుకొని.. వాటి గురించి ఢిల్లీ ఉగాది కవిసమ్మేళనంలో గట్టిగా వినిపించాలని తీర్మానం చేశాయి. ఆ బాధ్యతను ఓ చురుకైన కవి కోయిలకు అప్పగించాయి. అందరి సూచనలూ సలహాలూ జాగ్రత్తలూ తీసుకొని... ఢిల్లీకి ప్రయాణమైంది కవి కోయిల.

                                                                       ***

   విజయవాడలోని భవాని ద్వీపం నుంచి బయల్దేరిన కోయిలకు బీడు వారిన అమరావతి భూములు కనిపించాయి. అసంపూర్తి భవనాలు దర్శనమిచ్చాయి. అక్కడొక రైతు కవి తనలో తానే ఏదో ఆవేదన చెందడం వినిపించింది. కాసేపు అక్కడి మామిడిచెట్టు మీద వాలింది.

''ఉగాదుల్లేవు మాకు ఉషస్సుల్లేవు
అడుగడుగునా అయోమయం
నిట్ట నిలువునా ఆశాభంగం
చేసిన బాసలన్నీ చెల్లాచెదురు
చెప్పిన మాటలన్నీ గుండు సున్నాలు
ఇంకెక్కడి ఉగాది మాకు
ఇంకెప్పుడు ఉషస్సు మాకు ..''

rajadhani formers

   మరావతి రైతుల ఆవేదన అర్థమైంది కోయిలకు. తన మనోపత్రం మీద ఆ సంగతిని రాసుకొంది. దేశ ప్రధాని మోడీ అమరావతి నిర్మాణం గురించి చెప్పిన కబుర్లను గుర్తుచేసుకొంది. ప్రత్యేక హోదా ఇచ్చి, నవ్యాంధ్రప్రదేశ్‌ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీలను జ్ఞాపకం చేసుకొంది. ఆ తరువాత మోడీ, అతడి సహచర మంత్రులూ హోదా సంగతిని గోదావరిలో కలిపిన వైనాన్నీ మననం చేసుకొంది. అమరావతి నిర్మాణానికి చెంబుడు నీళ్లూ, చారెడు మట్టి ధారవోసిన దృశ్యాన్ని జ్ఞప్తి చేసుకొంది. తుప్పు పట్టిన ఆ చెంబుకూ, పిచ్చి మొక్కలు మొలిసిన ఆ శంకుస్థాపన స్థలాన్ని ఓ ఫొటో తీసి, భద్రంగా దాచుకొని, అక్కణ్ణుంచి బయల్దేరింది.

rally

   క్కునగరం విశాఖపట్నంలోకి ప్రవేశిస్తుండగానే- కూర్మన్నపాలెం వద్ద కోలాహలం కనిపించింది. స్టీల్‌ప్లాంటు పైలాన్‌ మీద వాలి, అక్కడి సంగతులు పరికించింది. అక్కడ స్టీల్‌ప్లాంటును బడాబాబులకు అమ్మేసే ప్రయత్నానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఆవేదన, ఆలోచన, ఆవేశం కలగలిసి ప్రసంగాలు సాగుతున్నాయి. మధ్యలో ఓ ఉక్కు కవి ఇలా వినిపించాడు :

'' ఉక్కు ఫ్యాక్టరీ అంటే కేవలం
ఇనుప ముక్కల కర్మాగారం కాదు
ఇది తెలుగు వాళ్ల త్యాగఫలం
రక్తమాంసాలూ స్వేద సముద్రాలూ
ధారవోసిన అపూర్వ నిర్మాణం
విశాఖ ఉక్కు అక్షరాలా ప్రజల హక్కు
అమ్మటానికి అప్పడం కాదు
కొనటానికి పిజ్జా పార్సిలూ కాదు
ఉక్కుతో పెట్టుకుంటే అవుతారు తుక్కు తుక్కు
లేకుండా పోతారు చరిత్రలో ఏ దిక్కు మొక్కు ''


   చాలామంది వక్తలు విశాఖ స్టీలుప్లాంటు ఎలా వచ్చిందో, ఎన్నెన్ని ఉద్యమాల, త్యాగాల ఫలితంగా ఏర్పడిందో వివరించారు. శ్రద్ధగా వింది కోయిల. ఈలోగా ప్లాంటు లోపల విశాలంగా విస్తరించి ఉన్న వనాల నుంచి వందలాది కోయిళ్లూ, చిలుకలూ, పిచ్చుకలూ, పావురాలూ, కాకులూ, గోరువంకలూ కవి కోయిల దగ్గరకు వచ్చాయి. ఢిల్లీ ఉగాది కవి సమ్మేళనానికి వెళుతున్నందుకు కవి కోయిలను ఘనంగా అభినందించాయి. ''ఈ అందమైన ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటుపరమైతే - ఈ చెట్లూ చేమలూ ఉంటాయా? ఉన్న భూములను వాళ్లు లాభాల కోసం ఆక్రమించుకుంటే- మా గతేం కాను?'' అని తమ ఆవేదన గట్టిగా వినిపించాయి.

''మనిషికైనా మానుకైనా
మనలాంటి పక్షులకైనా
ప్రభుత్వ రంగం ఉంటేనే హాయి..
కార్పొరేట్లు వస్తే
అంతా లాభాల యావేనోయి
సుఖసంతోషాలు సున్నా భాయీ..''

migrant labour



   అంది ఓ చిలకమ్మ. ''అవునవును..'' అని పక్షులన్నీ తలలూపి, రెక్కలను టపటపలాడించాయి. తరువాత కవి కోయిలకు చక్కని ఆతిథ్యమిచ్చి, ప్రియంగా వీడ్కోలు పలికాయి.

   గిరి ఎగిరి అలసిన కోయిల సేద తీరటానికి ఒడిశాలోని ఓ పల్లెప్రాంతంలో ఆగింది. ఓ చెట్టు కొమ్మ మీద కూచొని, సేద తీరుతోంది. ఇంతలో ఓ సన్నని రాయి పక్కలోంచి దూసుకుపోయింది. వెంటనే తేరుకొని కిందికి చూస్తే- ఏ పదేళ్ల కుర్రోడు ఉండేలు పెట్టుకొని తనవైపే చూస్తున్నాడు. వాడి వెనక ఆ వయసువాళ్లే ఇంకో నలుగురు ఉన్నారు. ''కొట్టు కొట్టు .. గురి చూసి కొట్టు'' అని అరుస్తున్నారు. ఖంగుతింది కోయిల. ''ఒరే అబ్బాయిలూ .. ఏంట్రా మీరు చేస్తున్న పని? నేను కవి కోకిలని. ఢిల్లీ వెళుతున్నాను!'' అంది.
   ''అయితే ఏంటట?'' అన్నాడు ఆ పిల్లోడు, కాస్త గడుసుగా.
   ''అక్కడ ఉగాది కవి సమ్మేళనం జరుగుతోంది. దానిలో నేను పాల్గొని, ప్రజలందరి సమస్యలూ వినిపిస్తాను. అయినా, మీరేంటి? బడికెళ్లి చక్కా చదూకోక- ఇలా ఉండేలుతో ఊరేగుతున్నారు?'' అంది. దానికి సమాధానంగా ఉండేలు పిల్లోడు ఇలా చెప్పాడు :

un employment



''చదువు లేక సంధ్య లేక
సరిపడా తిండి లేక చస్తున్నాం పస్తులతో
వినవమ్మా, కోయిలమ్మ
వలసెల్లిన అమ్మానాన్న
తిరిగొచ్చిరి పనుల్లేక ..
బడులేమో మూసేసిరి
కరోనా కమ్ముకొచ్చి ...
ఏడాదిగ చదువు లేదు
ఇంటిలోన బువ్వ లేదు
వినిపించుము మా బాధ
మోడీకి మహా బాగా ...
''

   ఆ బాల కవి ఆవేదనతో కదిలిపోయింది కోయిలమ్మ. ''మీ సమస్యను తప్పకుండా ఢిల్లీలో వినిపిస్తాను.'' అని చెప్పి, అక్కణ్ణుంచి, రివ్వున ఎగిరింది !
   ధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ- రోజుల తరబడి ప్రయాణించింది. బడలిక బాగా పెరిగింది. అలా అని ప్రయాణం ఆపేస్తే- ఎలా? బెంగాల్‌లోని ఓ మోస్తరు పట్టణంలో ముందుకు సాగుతున్న ఓ ఆటోపై వాలింది. '' ఎక్కడిదాకా, ఓ కోయిలమ్మా..'' అనడిగాడు డ్రైవరు. ''ఢిల్లీదాకా ఓ ఆటోబాబూ'' అంది కోయిల. ''ఎందుకోసమో, అంత దూరం?'' అనడిగితే- విషమయంతా చెప్పింది. ''అయితే, మా బాధ కూడా వింటావా ? అక్కడ వినిపిస్తావా ? '' అన్నాడు. ''తప్పకుండా వింటాను. తడబడకుండా వినిపిస్తాను.'' అంది.

'' డిగ్రీలు చదువుకున్న నిరుద్యోగిని నేను
రెండు కోట్ల జాబులంటే
ఎంతో సంతోషించాను...
ఏళ్లేమో గడిచాయి; ఉజ్జోగం ఊసు లేదు
ప్రశ్నిస్తే లాఠీలూ, దేశభక్తి పాఠాలూ
ఉన్మాదం ఎక్కించి ఊపేసే పాశాలూ

మతం పేర విద్వేషం, మనుషులపై ఉక్రోశం
ఇంతేనా మా గతి? ఇదేనా దేశ ప్రగతి ?''

cycle rally

   ఆ యువకుడి ఆవేదన విని, చాలా బాధ పడింది కోయిల. మీలాంటి యువతీ యువకులు ఏకమె,ౖ గట్టిగా ప్రశ్నించాలంది. పాలకులను నిలదీయాలని అంది. ''యువత ప్రశ్నించకుండా ఉంటుందా, కోయిలమ్మా.. వర్తమాన భారతం ఎలా సాగుతుందో నీకు తెలుసు కదా ! ప్రశ్నిస్తే అభాండాలూ అవరోధాలూ.. నోర్మూయించే కేసులూ జైళ్లూ. విపరీతంగా అబద్ధాల ప్రచారాలూ .. ఉన్మాద మూకలతో దాడులూ దౌర్జన్యాలూ. అయినా, ఆగదు మా యువతరం. ఎత్తిన పిడికిలి దించదు. శాసించాలనుకొని ఎందరో నియంతలు.. కాలగర్భంలో కలిసిపోయారు..'' అన్నాడు ఆ యువకుడు. ''ఇలాంటి ధైర్యమే కావాలి దేశానికి'' అని అతడిని అభినందించి, ఆకాశంలోకి ఎగిరింది కవి కోయిల.

   చాలా రోజుల ప్రయాణం తరువాత- బీహార్లోని ఓ ఊళ్లో రావిచెట్టు మీద వాలింది. అక్కడేదో పంచాయతీ జరుగుతోంది. వేరే ఊరి నుంచి సైకిలు మీద వచ్చిన ఇద్దరు యువకులు దాహంగా ఉందని... ఆ ఊరి మంచినీటి బావిలో నీరు తాగారట! వెంటనే కొందరు వారిని చుట్టుముట్టి ఊరూ పేరూ వంటి వివరాలు అడిగారు. వాళ్లు తక్కువ కులానికి చెందిన వారని నిర్ధారించి, బావిని మైలపరిచారని నింద మోపారు. చెట్టుకు కట్టేశారు. రకరకాలుగా వేధించటం మొదలెట్టారు. అది చూసి కోయిలమ్మ మనసు విలవిల్లాడిపోయింది. ''మనుషుల్లో ఇంత వివక్షా? ఇంత అమానవీయ లక్షణమా? '' అని విస్తుపోయింది. విచారపడింది. అక్కడ ఇంకో క్షణం కూడా ఉండలేక - బాధావహమైన మనసుతో పైకెగిరింది.

'' ఇంకానా ఇంకానా
కులాల కుళ్లూ మతాల తేళ్లూ ఇంకానా?
మనిషి ఎదిగిన క్రమం ఏమిటో
ఆస్తులపైన పెత్తనం ఎలాగో
అణగిన జాతుల చరిత్ర ఏమిటో
తెలియని కాలం ఇంకానా?
మనువాదపు మురికి గుంటలో
పొర్లే రోజులు ఇంకానా ?
ఇంకానా ఇంకానా
వివక్ష రాజ్యం ఇంకానా ? ''

అనుకుంటూ సాగింది.

   చీకటి పడింది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఊరి చివరి మర్రిచెట్టు మీదకు చేరింది. ఆ చెట్టు మీద ఉన్న రకరకాల పక్షులూ, ఉడుతలూ ప్రత్యేక అతిథిగా కోయిలమ్మను గౌరవించాయి. ఆ ఊరి విశేషాలను వివరించటం మొదలెట్టాయి. ఇంతలో ఓ అమ్మాయిని వెంటాడుతూ ఓ నలుగురు పోకిరీలు కనిపించారు. ఏదో మాట్లాడుతూ ఆమెను సమీపిస్తున్నారు. ఆమె విపరీతంగా భయపడుతోంది. భయపడుతూనే ఊరి వైపు వేగంగా నడుస్తోంది. పోకిరీలు వేగం పెంచారు. ఆమెను చుట్టుముట్టారు. వాళ్లు ఆ అమ్మాయిని వేధిస్తున్నారని కోయిలమ్మకు అర్థమైంది. పక్షులన్నింటినీ ఒకేసారి విపరీతంగా అరుస్తూ .. తనను అనుసరించమని సూచించింది. అవి అలాగే చేశాయి. పోకిరీల మీద కాళ్లతో దాడి చేస్తూ ... ఊరికీ ఆ చెట్టుకూ మధ్య గిరికీలు కొడుతూ కొంతసేపు గందరగోళాన్ని సృష్టించాయి పక్షులు. ఏం జరుగుతుందా అని ఊరి వాళ్లు బయటికి వచ్చారు. రోడ్డు మీద దృష్టి సారించారు. ఆ అమ్మాయిని వెంటాడుతున్న పోకిరీలను పట్టుకొని, దేహశుద్ధి చేశారు. పక్షులకు, ఆ ఊరి వారికి కృతజ్ఞతలు చెప్పింది ఆ అమ్మాయి.

10 women protest



'' కొందరు మనుషులు చాలా హేయం
జంతువులం పక్షులం మేమే నయం
మీతో పాటే మసలే మగువకు
భయమూ భీతీ ఎందులకు ?
సాటి మనిషిగా చూడని నీచం
మగ మనుషుల్లారా, మీకెందులకు ? ''
   అని ఆ రాత్రంతా పక్షులు ఆ ఊరి మీద ఎగురుతూ పాడుతూనే ఉన్నాయి.

formers new delhi


   తెల్లారి ఆ పిట్టల నుంచి వీడ్కోలు తీసుకొని, ఢిల్లీకి అభిముఖంగా ఎగరడం మొదలు పెట్టింది కోయిలమ్మ. ఢిల్లీ నగర సరిహద్దులు నలువైపులా రైతులు మోహరించి కనిపించారు. పొలాల మధ్య పైరు సేవలో పులకించాల్సిన అన్నదాతలు ... నెలల తరబడి రోడ్ల మీద నిరీక్షించాల్సి రావడం ఎంత దౌర్భాగ్యమో కదా అని బాధ పడింది. ఒక రైతు శిబిరం దగ్గర ఆగింది. అక్కడ చాలామంది పాటలు పాడుతున్నారు. ఆటలాడుతున్నారు. ఎన్నో విషయాలపై మాట్లాడు తున్నారు. అన్నిటినీ ఎంతో శ్రద్ధగా వింది కోకిల.

'' చెట్టే నిను వద్దంటుంటే
ముద్దని చెబుతావేంటే చీడ
రైతును ముంచే సాగును తుంచే
ఆ చట్టాలే మాకొక పీడ ...
అన్నదాతకే సున్నం వేసే
అపర శకునివి మోడీ
కార్పొరేట్ల పాద సేవలో
తరించు నువ్వొక కేడీ ...
తలపాగా ఎత్తిచూపు రాజురా రైతంటే
తల మీదే కొడుతుంటే చూస్తామా, ఊరుకుంటూ
నీ తలపొగరును అణుచుదాకా సాగుతుంది మా పోరు
తలవొంచని ధైర్యానికి అన్నదాత మారు పేరు .. ''


   ఇలా ఉత్తేజకరంగా సాగుతోంది రైతు కవుల కవితాగానం. అన్నదాతల్లో అంతటి పట్టుదలను చూసి చాలా సంతోషం కలిగింది. వారికి సంఘీభావంగా దేశం నలువైపుల నుంచి వెల్లువై వస్తున్న జనాన్ని చూసి ఆనందపడింది. వివిధ ఉద్వేగాల పేరిట, ఉన్మాదాల పేరిట ప్రజలను విడదీయడం పాలకుల ఎత్తుగడ అయితే- వివిధ పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా కుల మత ప్రాంతాలకు అతీతంగా సంఘటితం కావటం ప్రజల వ్యూహం అవుతుంది. రైతు ఉద్యమంలో అది చాలా స్పష్టంగా కనిపిస్తున్నందుకు చాలా సంతోషపడింది కోయిల.

                                         ఆరోజే ఉగాది. కవి సమ్మేళనం మొదలైంది !

   గేటు బయట రాబందులు కొన్ని నిఘా వేసి కూచున్నాయి. ఏ కవి ఎక్కడి నుంచి వచ్చారో, వారి నేపథ్యం ఏమిటో ఆరా తీస్తున్నాయి. చదవబోయే కవిత్వాన్ని ముందుగా తమకు వినిపించమని ఆదేశిస్తున్నాయి. ''జయహో జయ జయహో పాలకా'' అన్న మకుటంతో కవిత్వం రాసిన అందరికీ మెడలో కండువాలు వేసి, సగౌరవంగా లోపలికి పంపిస్తున్నాయి. ప్రశ్నో, ఆవేదనో, ఆందోళనో వ్యక్తం చేసే కవిత్వం రాసిన వారిని లోపలికి నిరాకరిస్తున్నాయి. దేశం మొత్తమ్మీద ఎక్కడెక్కడినుంచో మన కోయిలమ్మ వలె ప్రజల ఆశలను ఆకాంక్షలను, ప్రశ్నలను ఫిర్యాదులను మోసుకొచ్చిన ఎన్నో కోయిళ్లూ నెమళ్లూ, చిలుకలూ పావురాలూ కాకులూ బయటే మిగిలిపోయాయి.

   అప్పుడు అంది మన కవి కోకిల : ''మిత్రులారా, ఆ నాలుగు గోడల మధ్యా స్తోత్రాలూ సుత్తిగీతాలూ పాడకుండా, వినకుండా ఉండే అవకాశం వచ్చినందుకు సంతోషిద్దాం. మనం మోసుకొచ్చిన పాటలను జనంలో వినిపిద్దాం. బహిరంగ కవితాగానం ఇక్కడే నిర్వహిద్దాం.''
   ఆ మాటలకు ఆమోదయోగ్యంగా పక్షులన్నీ రెక్కలను టపటపలాడించాయి. కూజితాలతో ఆ ప్రాంతాన్ని మార్మోగించాయి. రాబందులు తొలుత క్రూరంగా కళ్లు మిటకరించినా- పక్షి బలాన్ని చూసి, తోక ముడిచాయి. తరువాత ప్రజా కవి సమ్మేళనం ఉత్తేజకరంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా వివిధ తరగతుల, ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై, సవాళ్లపై కవితలు అస్త్రాలై, శస్త్రాలై పోటెత్తటం మొదలైంది!

'' మా పాటొక ఆయుధం
కవితొక అక్షరాస్త్రం
మేమెప్పుడూ ప్రజాపక్షం
ఆందోళన మా ఊపిరి
అలజడి మా వేదాంతం ! ''

cooleelu

 

- సత్యాజీ, 94900 99167