Apr 19,2023 23:35

నిందితుడు వసంతరావు

ప్రజాశక్తి - ప్రత్తిపాడు : క్వార్టర్‌ మద్యం కోసం కన్న కొడుకునే తండ్రి అమ్మేసుకున్న ఘటన మండలంలోని కోయవారిపాలెంలో బుధవారం వెలుగు చూసింది. బిడ్డ తల్లి కొండమ్మ వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా కేంద్రానికి చెందిన కొవరగిరి వసంతరావుకు పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంతానికి చెందిన కొండమ్మకు కొన్నేళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు బిడ్డలు. ఏలూరు నివాసం ఉండే వీరికి పనులు సరిగా లేకపోవడంతో తెలిసిన బంధువుల వద్దకు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని కోయవారిపాలేనికి రెండు నెలల కిందట వచ్చారు. కొండమ్మ కూలి పనులకు వెళ్తుండా వసంతరావు తమ ఇద్దరు కుమారులును చూసుకుంటూ ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట కొండమ్మ పనికి వెళ్లి వచ్చే సరికి వసంతరావు, ఏడాదిన్నర వయస్సున్న తన చిన్న కుమారుడు ఏసురాజు కనిపించలేదు. అప్పటి నుండి వారి కోసం వెదుకులాడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం వసంతరావు మద్యం తాగి తూగుతూ ఇంటికి ఒక్కడే వచ్చాడు. పిల్లవాడు ఏడి.. అని భార్య కొండమ్మ ప్రశ్నించగా తనకు తెలిసిన వారికి అమ్మేశాని వసంతరావు సమాధానమిచ్చాడు. దీంతో ఆమె ప్రత్తిపాడు పోలీసులను ఆశ్రయించారు. మద్యం కోసం తన భర్త తన బిడ్డనే అమ్ముకున్నారని వాపోయారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.