Oct 06,2023 21:59

క్వారీపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్న వాలంటీర్లు, నాయకులు

ప్రజాశక్తి-భోగాపురం : క్వారీలో ఇష్టానుసారంగా బాంబు పేలుళ్లతో భయాందోళన చెందుతు న్నామని రామచంద్ర పేటకు చెందిన అధికార పార్టీ నాయకులు, గ్రామస్తులు, వాలంటీర్లు నేరుగా కలెక్టర్‌ నాగలక్ష్మికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీంతో క్వారీ అనుమతులు పరిశీలించాలని తహశీల్దార్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే...
జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పరిశీలించేందుకు కలెక్టర్‌ నాగలక్ష్మి రామచంద్రపేట గ్రామానికి శుక్రవారం వచ్చారు. గ్రామానికి ఆనుకుని ఉన్న క్వారీలో పట్టపగలే బాంబు బ్లాస్టింగ్‌ చేస్తున్నారని, పేలుళ్లకు ఇళ్లు అదురుతున్నాయని కలెక్టర్‌కు గ్రామస్తులు తెలిపారు. రాళ్లు కూడా ఇళ్లపై వచ్చి పడుతున్నట్లు ఆమెకు తెలిపారు. దీనిపై కలెక్టర్‌ మాట్లాడుతూ క్వారీకి ఎంతవరకు అనుమతులు ఉన్నాయో పరిశీలించాలని తహశీల్దార్‌ బంగార్రాజును ఆదేశించారు. తాను కూడా మైనింగ్‌ అధికారులతో ఈ సమస్యలపై మాట్లాడతానని చెప్పారు. సచివాలయం 90 శాతం నిర్మాణం పూర్తి చేశారని, అయితే ఇదీ క్వారీ పక్కన కావడంతో క్వారీ యాజమాన్యం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుందని వాలంటీర్లు చెప్పారు. అప్పట్లో క్వారీ నిలుపుదల చేయడంతో సచివాలయ నిర్మాణానికి క్వారీ పక్కన స్థలం ఇవ్వడంతో నిర్మించేశారని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. స్టే ఎత్తి వేసేందుకు ప్రయత్నిస్తామని ఆమె అన్నారు. గ్రామంలో రేషన్‌ సరుకులు రెండు నెలలకు ఒకసారి ఇస్తున్నారని, రేషన్‌ డిపో ద్వారా సరుకులు సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో ప్రజలంతా ఇబ్బంది పడుతున్నామని ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
టీచర్లపై కలెక్టర్‌ అసహనం
రక్తహీనత ఉన్న విద్యార్థులకు మాత్రలను ఇంటికి పంపిణీ చేయడంపై కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం భోజనం తర్వాత వారు పాఠశాలలోనే మాత్రలు వేసుకున్న తర్వాత ఎన్‌రోల్‌మెంట్‌ చేయాలని చెప్పారు. కానీ ఇంటికి మాత్రలు ఇస్తే వారు వేసుకుంటున్నది, లేనిది ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు.