ప్రజాశక్తి-అనకాపల్లి
తమ గ్రామంలో స్టోన్ క్రషర్లు, క్వారీలు ఏర్పాటు చేయొద్దని మండలంలోని మార్టూరు గ్రామస్తులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. క్వారీలు, క్రషర్లు వల్ల తమ గ్రామంలో గాలి, నీరు కాలుషితమయ్యాయని, శబ్ధ కాలుష్యంతో ఇళ్లు దెబ్బతినడంతో పాటు ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, పశువులు చనిపోతున్నాయని తెలిపారు. పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో మార్టూరు గ్రామంలో సర్వే నెంబర్ 1లో శ్రీనామా కృష్ణయ్య పేరుతో 13.33 హెక్టార్లలో ఏర్పాటు చేయనున్న రోడ్డు మెటల్, బిల్డింగ్ స్టోన్ క్వారీ, అదే సర్వేనెంబర్‌లో ర్యాంక్ సిలికాన్ అండ్ ఇండిస్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ 10.13 హెక్టార్లలో ఏర్పాటు చేయనున్న క్రషర్లపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ముఖ్యఅతిథిగా డిఆర్‌ఓ వెంకటరమణ హాజరై దీనిని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ 22 ఏళ్లుగా నామా కృష్ణయ్య క్వారీ నడుస్తున్నా ప్రజలకు ఎటువంటి సదుపాయాలు కల్పించలేదన్నారు. ఈ క్వారీని ఆనుకొని ఉన్న పశువులు పాకలు దెబ్బ తినడం, పశువులు చనిపోయాయని తెలిపారు. పక్కనే ఉన్న గెడ్డ కప్పి వేయడంతో పంట పొలాలకు నీరు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు నివేదికలతో అధికారులను, ప్రజలను మభ్యపెట్టి యాజమాన్యం క్రషర్లు క్వారీలు ఏర్పాటు చేయడం బాధాకరమన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ప్రజల మధ్యలో జరగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మైన్స్ అసిస్టెంట్ జియాలజిస్ట్ వర్మ తదితరులు పాల్గొన్నారు.










