
ప్రజాశక్తి - సాలూరు : మండలంలోని కరాసువలస పంచాయతీ పరిధిలో గుర్రపువలస సమీపానున్న క్వారీ పేలుళ్లతో ఇళ్లు బీటలు వారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ మేరకు సమీప గ్రామాల గిరిజనుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. క్వారీ చుట్టూ ఉన్న భూముల్లో జీడి, మామిడి తోటలు, ఇతర పంటలు నాశనమవుతున్నాయని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. 2018లో ఇక్కడ క్వారీ ఏర్పాటు చేశారు. పట్టణానికి చెందిన ఓ వ్యాపారి ఇక్కడ క్వారీ ఏర్పాటు చేశారు. మొదట్లో క్వారీ ఏర్పాటుపై సమీప గ్రామాల గిరిజనులు వ్యతిరేకించినా క్రమేణా యజమాని వారిని ప్రసన్నం చేసుకున్నారు. గడచిన నాలుగేళ్లుగా క్వారీలో పిక్క రాయి, క్వారీ డస్ట్ అమ్మకాలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో క్వారీలో రాయిని పేల్చడంతో ఆ అదురుకు సమీపాన గల గుర్రపువలసలో గిరిజనుల ఇళ్లు బీటలువారుతున్నాయి. దీంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతు న్నారు. ఏటా లక్షలాది రూపాయలు వ్యాపారం చేసుకుంటున్న యజమాని చుట్టూ ఉన్న భూముల్లో పంటలు దెబ్బతినకుండా కనీస చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వారీ ఏర్పాటుకు ముందు పచ్చని తోటలు, పంటలతో ఉండే భూములు బీడువారు తున్నాయి. దీంతోపాటు శబ్ద, వాయు కాలుష్యాలతో గిరిజనులు అనారోగ్యానికి గురవుతున్నారు. క్వారీ సమీపంలో ఉన్న గుర్రపు వలసలో వంద గిరిజన కుటుంబాలు ఉంటున్నాయి. ఈ గ్రామం క్వారీకి 500మీటర్ల దూరంలో ఉంటుంది. యంత్రాలతో పిక్క రాయి తయారు చేస్తుండడంతో సమీపంలో ఉన్న పంట భూములు దుమ్మూ, ధూళితో కప్పేయబడుతున్నాయి. ఫలితంగా ఫలసాయం తగ్గి గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఎకరానికి రూ.3వేలు శిస్తు
క్వారీ చుట్టూ భూములున్న రైతులకు క్వారీ యాజమాన్యం ఏటా రూ.3వేలు శిస్తుగా ఇచ్చి చేతులు దులుపుకొంటోంది. క్వారీ ఏర్పాటు చేసినప్పటి నుంచి రూ.3వేలు మాత్రమే శిస్తుగా యజమాని ఇస్తున్నారు. దీంతో గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. క్వారీ కొండ చుట్టూ సుమారు 30ఎకరాలకు సంబంధించిన రైతులకు ఏటా నామమాత్రపు శిస్తును యజమాని చెల్లిస్తున్నారు. గుర్రపులస, కరాసువలస గ్రామాలకు చెందిన రైతుల భూములు ఈ కొండ చుట్టూ వున్నాయి. గడివలస వరకు ఈ క్వారీకి దుమ్ము ధూళి వ్యాపిస్తుండడంతో ఈ గ్రామస్తులు కూడా నష్టపోతున్నారు. సమీప గ్రామాల్లో భూగర్భ జలాలు కూడా క్వారీ నిర్వహణతో కలుషితమవుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
పంట తోటలు నాశనమయ్యాయి
క్వారీ చుట్టూ నాకు మూడు ఎకరాల భూమి వుంది.దీనిలో జీడి మామిడి చెట్లు వున్నాయి.క్వారీ యజమాని ఏటా ఎకరానికి మూడు వేల రూపాయలు శిస్తు గా చెల్లిస్తున్నారు.పెంచాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు.మొదటి నుంచి ఆ మూడు వేల రూపాయలే చెల్లిస్తున్నారు.దీని వల్ల మేం తీవ్రంగా నష్టపోతున్నాం.క్వారీ పేలుళ్ళతో నా పొలాల్లోకి పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి పడుతున్నాయి.దీని వల్ల కూడా నష్టం జరుగుతోంది.
పాలిక నర్సయ్య, గిరిజన రైతు
కలెక్టర్‌కు త్వరలో ఫిర్యాదు
క్వారీ వల్ల ఏటా గ్రామపంచాయతీకి ఏ విధమైన ఆదాయం రావడం లేదు. చెల్లించాల్సిన పన్ను కట్టడం లేదు. క్వారీ చుట్టూ ఉన్న పంట భూములు నాశనమయ్యాయి. ఏటా మూడు వేల రూపాయలు శిస్తుగా ఇచ్చి యజమాని చేతులు దులుపుకుంటున్నారు. గుర్రపువలస, కరాసువలస గ్రామాల్లో పేలుళ్ల ప్రభావానికి ఇళ్లు బీటలు వారుతున్న పరిస్థితి ఏర్పడింది. శబ్ద, వాయు కాలుష్యం ఎక్కువగా వుంది. కొంతమంది రైతులు చేసిన ఫిర్యాదు మేరకు త్వరలో జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తాను.
ఒంటి లక్ష్మి, సర్పంచ్, కరాసువలస