ప్రజాశక్తి - వేపాడ : మండలంలోని వావిలిపాడు రెవెన్యూ పరిధిలో గల సర్వే నెంబరు 58లో 8 ఎకరాల విస్తీర్ణంలో రాతి క్వారీ నిర్వహణకు బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి అనిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ముందుగా సర్పంచ్ బీల రాజేశ్వరి మాట్లాడుతూ ఇంతవరకు తమ గ్రామంలో క్వారీల నిర్వహణకు ఎప్పుడూ సమావేశాలు జరగలేదన్నారు. క్వారీలు ఏర్పాటు చేయడం వల్ల ఆదాయం వచ్చి గ్రామాభివృద్ధి జరుగుతుంది కానీ లారీలు రాకపోకలు వల్ల గ్రామంలో పలువురు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి ప్రమాదంలో ఒకరు మరణించారని గుర్తు చేశారు. వావిలపాడు నుంచి దేవరపల్లి, కొత్తవలస వెళ్లి రోడ్డు మూడు కిలోమీటర్ల పొడవున వెడల్పు చేస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చునన్నారు. సమావేశానికి హాజరైన వారంతా క్వారీ ఏర్పాటుకు ఆమోదం తెలిపితే తనకు ఎటువంటి అభ్యంతరమూ లేదన్నారు. సచివాలయ జెఎసి కన్వీనర్ బీల సతీష్ మాట్లాడుతూ గోగాడ జగన్నాథం నాయుడు క్వారీకి అనుమతులు కోసం ప్రజాభిప్రాయ పెట్టడం మంచి పరిణామమన్నారు. క్వారీ ఏర్పాటు చేయడం వల్ల గ్రామంలో కొంతమంది యువతకు ఉపాధి కలిగే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా క్వారీకి ఆనుకొని ఉన్న పంట పొలాల నష్టపోయిన రైతులను గుర్తించి నష్టపరిహారం చెల్లించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం క్వారీ నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న గోగాడ జగన్నాథం నాయుడు మాట్లాడుతూ గ్రామస్తులందరూ సహకారంతో ఏర్పాటు చేస్తున్న క్వారీ వల్ల గ్రామానికి గ్రామ ప్రజలకు ఏ విధమైన హాని జరగకుండా చూసే బాధ్యత తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో భూగర్భ గనుల శాఖ ఎంఇ సరిత, తహశీల్దార్ కె ప్రసన్నకుమార్, డిటి సన్యాసినాయుడు, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.










