Nov 17,2023 22:53

క్వాడ్రాంగ్యులర్‌ క్రికెట్‌ టోర్నీ -

ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ : బీసీసీఐ (భారత క్రికెట్‌ నియంత్రణ మండలి) ఆధ్వర్యంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసిఎ) పర్యవేక్షణలో అండర్‌ -19 క్వాడ్రాంగ్యులర్‌ వన్డే క్రికెట్‌ టోర్నీలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో ఇండియా - ఎ జట్టు, ఇంగ్లాండు జట్టు విజయం సాధించాయి. మూలపాడులోని డివిఆర్‌ గ్రౌండ్‌లో ఇండియా - ఎ, ఇండియా - బి జట్ల మద్య మ్యాచ్‌ జరిగింది. ఈమ్యాచ్‌లో ఇండియా ఎ జట్టు రెండు వికెట్ల ఆధిక్యతతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇండియా ఎ జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీనితో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా -బి జట్టు 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది. జట్టులోని ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ రుద్ర మయూర్‌ 134 బంతుల్లో ఎనిమిది సిక్సర్లు, 16 బౌండరీల సహాయంతో 164 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్‌మెన్‌ సచిన్‌ దాస్‌ 112 బంతుల్లో ఏడు సిక్సర్లు, పది బౌండరీల సహాయంతో 135 పరుగలు చేశాడు. ఇండియా బి జట్టు బౌలర్లు మురుగన్‌ రెండు, సౌమ్య కుమార్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు. అనంతరం 376 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా - ఎ జట్టు 46.3 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 378 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులోని అరవెల్లీ అవనీష్‌ 93 బంతుల్లో 12 సిక్సర్లు, 12 బౌండరీల సహాయంతో 163 పరగులు, మురుగన్‌ అభిషేక్‌ 62 బంతుల్లో ఒక సిక్సర్‌, ఎనిమిది బౌండరీల సహాయంతో 81 పరుగులుచేశారు. ఇండియా బి జట్టు బౌలర్లు ప్రేమ్‌ మూడు వికెట్లు, విగేష్‌ మూడు వికెట్లు తీసుకున్నారు. ఇండియా ఎ జట్టు విజయం సాధించడంతో రెండు పాయింట్లను ఇచ్చారు. ఇండియా ఎ జట్టు బ్యాట్స్‌మెన్‌ అరేవిల్లీ అవనీష్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు ప్రకటించారు.
13 పరగులతో ఇంగ్లాండ్‌ విజయం... ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌ జట్ల మద్య జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల ఆధిక్యతతో ఇంగ్లాండ్‌ జట్టు విజయం సాధించింది. ఈమ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీనితో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ జట్టు 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 322 పరగులు చేసింది. జట్టులోని హంజా షేక్‌ 119 బంతుల్లో 126 పరుగులు, తయన్‌ 113 బంతుల్లో 88 పరుగులు చేశారు. బంగ్లాదేశ్‌ బౌలర్లు ఎం డి ఇక్భాల్‌ హజన్‌ నాలుగు వికెట్లు, మురుఫ్‌ మృదా మూడు వికెట్లు తీసుకున్నారు. అనంతరం 323 పరగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ జట్టు 49.3 ఓవర్లలో 309 పరుగులకే అంతా అవుటయ్యారు. దీనితో 13 పరుగుల ఆధిక్యతతో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మెన్‌ షేక్‌ జిబిన్‌ 60, అ మీన్‌ 66, పరుగులు చేశారు. ఇంగ్లాండు బౌలర్లు ఎడ్వర్డ్‌ జాక్‌ ఐదు వికెట్లు, మిచెల్లి మూడు వికెట్లు, తీసుకున్నారు.