కూతురి వైద్యం కోసం వచ్చి...
కడతేరిన తండ్రి
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
కూతురు వైద్యం కోసం వెళ్లి తండ్రి కడతేరిన ఘటన మంగళవారం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో వెలుగు చూసింది. బాధితుల కథనం మేరకు..తొట్టంబేడు మండలం దిగువసాంబయ్యపాలెంకు చెందిన చల్లారెడ్డి(55) తన కూతురు పోలమ్మకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేందుకు సోమవారం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి వచ్చాడు. రాత్రి సమయంలో మగవారు ఆసుపత్రిలో నిద్రించకూడదన్న నిబంధన ఉండటంతో చల్లారెడ్డిని సెక్యూరిటీ సిబ్బంది బయటకు పంపేశారు. దీంతో చల్లారెడ్డి చేసేదేమీ లేక ఆసుపత్రి గేటు వద్ద ఉన్న డ్రైనేజీ కల్వర్టుపై పడుకుని నిద్రపోయాడు. అయితే గాఢ నిద్రలో ఉన్న చల్లారెడ్డి ప్రమాదవశాత్తు మురుగుకాలువలో పడిపోయాడు. ఆ సమయంలో నిద్రమత్తులోంచి తేరుకునేే లోపే ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు చల్లారెడ్డి కోసం వెతుకుతుండగా గేట్ వద్ద కల్వర్టు పక్కనే చెప్పులను గుర్తించారు. మురుగు కాలువలో పడి ఉంటాడన్న అనుమానంతో వెతికి చూడగా చల్లారెడ్డి విగతజీవిగా పడివుండటాన్ని గుర్తించారు. స్థానికుల సాయంతో చల్లారెడ్డి మృతదేహాన్ని బయటకు తీయగా మతుని బార్య, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే ఆసుపత్రికి వచ్చే రోగి బంధువులు విశ్రాంతి తీసుకునేందుకు నిర్మించిన విశ్రాంతి గదులను గత ఆర్నెళ్ల కాలంగా వాడకపోవడం కారణంగానే ఇలాంటి ప్రమాదం జరిగిందని చల్లారెడ్డి బంధువులు ఆరోపించారు. అయితే ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని టూటౌన్ పోలీసులు తెలిపారు.
నిద్రించడానికి స్థలం లేక మురుగుకాల్వ గట్టుపై పడుకుని మృతిచెందిన ఘటన










