Apr 02,2023 22:28

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
           ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిపై ఓ వ్యక్తి హత్యాయత్యానికి పాల్పడిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో కలకలం సృష్టించింది. ఆదివారం వేకువజామున రక్తపు గాయాలతో ఉన్న భార్య, భర్త, కొడుకుని స్థానికులు, బంధువులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో భర్త మృతిచెందాడు. భార్య, కుమారుడు చికిత్స పొందుతున్నారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మైసన్నగూడేనికి చెందిన తోణం శివ, భార్య చిన్ని ఇద్దరూ గ్రామంలో వర్జీనియా పొగాకు క్యూరింగ్‌లో పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. కొడుకు మంగరాజు(11) చదువుకుంటున్నాడు. రోజూమాదిరిగా అదె ఊరిలో ఉన్న బ్యారన్‌ వద్దకు శివ క్యూరింగ్‌ పనులు చేసేందుకు వెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తి శివ తలపై ఆయుధంతో బలంగా కొట్టాడు. అలాగే శివ ఇంటి వద్దకు వెళ్లి ఇంటిలో నిద్రిస్తున్న భార్యపై, కుమారుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఆదివారం వేకువజాము నాలుగు గంటల సమయంలో పక్కనే మరో బ్యారన్‌ డ్రైవర్‌ వచ్చి చూడగా రక్తపు మడుగుల్లో పడి ఉన్న శివను చూసి కంగారుపడి, ఈ విషయాన్ని భార్యకు చెబుతామని ఇంటికి వెళ్లి చూడగా ఇంటిలో శివ భార్య, కుమారుడు కూడా రక్తపుమడుగులో పడి ఉండటాన్ని చూసి బంధువులకు సమాచారం అందించాడు. వెంటనే వారు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శివ, చిన్ని పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ఆస్పత్రికి తరలించారు. గుంటూరులో పరిస్థితి విషమించి శివ మృతిచెందాడు. విషయం తెలుసుకున్న జంగారెడ్డిగూడెం సిఐ బాలాసురేష్‌, ఎస్‌ఐ సాగర్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. డాగ్‌ స్వ్కాడ్‌, క్లూస్‌ టీములను రప్పించి వివరాలను సేకరించారు. పొలీస్‌ జాగిలం ఇంటి పరిసరాల్లో, ఇంటికి సమీపంలోని పామాయిల్‌ తోటలో తిరుగాడింది. దాడికి ఉపయోగించిన రాడ్డు చెరువులో లభ్యమైనట్లు సమాచారం. ఈ ఘటనలో వేగవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కుటుంబ తగదాలు, ఆర్థిక లావాదేవీలు, స్నేహితుల మధ్య గొడవల కారణంగా ఈ దాడికి పాల్పడి ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సిఐ బాల సురేష్‌ తెలిపారు.