ప్రజాశక్తి - నెల్లిమర్ల : నగర పంచాయతీ పారిశుధ్య విభాగంలో కాంట్రాక్ట్ కార్మికురాలుగా పనిచేస్తూ 2021 అక్టోబర్ 6న అనారోగ్యంతో మరణించిన తుపాకుల రమణమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) నాయకులు జగన్మోహన్‌రావు కోరారు. సిఐటియు ఆధ్వర్యంలో నగర పంచాయతీ చైర్మన్ బంగారు సరోజిని, వైస్ చైర్మన్లు సముద్రపు రామారావు, కారుకొండ కృష్ణ, కౌన్సిలర్లకి బుధవారం నగర పంచాయతీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఏ. జగన్మోహన్ రావు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా తుపాకులు రమణమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అడుగు తుంటే జీవో లేదని అధికారులు దాటవేస్తున్నారన్నారు. పర్మినెంట్ కార్మికులకు ఉన్న జీవో ఆధారంగా మానవతా దృక్పథంతో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, బొబ్బిలి తదితర చోట్ల స్థానిక ఎమ్మెల్యేలు, కౌన్సిల్ ఆమోదంతో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా కారుణ్య నియమాకాలు చేపడుతున్నారని నెల్లిమర్లలో కూడా ఆ విధంగా కౌన్సిల్ తీర్మానించి ఎమ్మెల్యే బడ్డు కొండ అప్పలనాయుడు సహకారంతో తుపాకుల రవణమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అనంతరం చైర్మన్ స్పందిస్తూ రమణమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వటానికి కౌన్సిల్ సానుకూలంగా ఉందని, ఎమ్మెల్యేతో మాట్లాడిన తర్వాతనే మీకు హామీ ఇవ్వగలమని చెప్పారు. వైస్ చైర్మన్ సముద్రపు రామారావు మాట్లాడుతూ కార్మికులుగా మీరు, కౌన్సిల్ గా మేము తుపాకుల రవణమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చే విధంగా ప్రయత్నం చేద్దామని, ఇప్పటికే ఎక్కడైనా ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఆధారాలతో ఎమ్మెల్యేను కలవాలని సూచించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో బాబురావు, దుర్గారావు, హరిబాబు తదితరులున్నారు.










